పెళ్లి బరాత్‌పైకి దూసుకెళ్లిన పెళ్లికొడుకు కారు

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 01:45 PM
 

ఛత్తీస్‌గఢ్‌లోని జంజ్గీర్‌ -చంపా జిల్లాలో ఒక పెళ్లి బృందం వేడుకగా బరాత్‌గా వెళుతున్న సమయంలో పెళ్లి కొడుకు కారు హఠాత్తుగా ఆ బరాత్‌పైకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు. పెళ్లి బృందం ఊరేగింపుగా వెళుతుండగా, అందులో కొందరు ఒక సినిమా పాటకు అనుగుణంగా నృత్యం చేస్తున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కారు దూసుకువచ్చి వారిని ఢీకొంది. ఆ కారులో పెళ్లికొడుకు ఉన్నాడు. పెళ్లి బృందం బరాత్‌ను చిత్రీకరిస్తున్న వీడియోలో ఈ ఘటన రికార్డయింది. పెళ్లిబృందాన్ని అనుసరిస్తూ పెళ్లి కొడుకును తీసుకు వస్తున్న కారు డ్రైవర్‌ పొరపాటు బ్రేకు బదులు యాక్సిలరేటర్‌ నొక్కడంతో కారు వేగంగా దూసుకెళ్లి అనేకమందిని ఢీకొంది. దీనితో కంగారుపడిన డ్రైవర్‌ కారును రివర్స్‌లో తీసుకువచ్చాడు. దీనితో మరింత మంది గాయపడ్డారు. కారు డ్రైవర్‌ కారును ఆపేసి కారులోనుంచి బైటపడి పారిపోయాడు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన మొత్తం పెళ్లి వేడుకలను చిత్రీకరిస్తున్న వీడియోలో రికార్డయ్యాయి. పోలీసులు ఈ వీడియోను పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో డ్రైవర్‌ మద్యం సేవించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.