గర్బిణిని మమత హత్య చేయించింది: సీపీ శాండిల్య

  Written by : Suryaa Desk Updated: Tue, Feb 13, 2018, 02:07 PM
 

హైదరాబాద్‌: నగరంలో సంచలనం రేపిన బొటానికల్‌ గార్డెన్‌ వద్ద గర్భిణీ హత్య కేసును పోలీసులు ఛేదించారు. గత నెల 29న వెలుగులోకి వచ్చిన గర్భిణీ హత్య కేసు నిందితులను సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని అన్నారు. హత్య కేసు నిందితులను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టి సైబరాబాద్‌ సీపీ సందీప్‌ శాండిల్య హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమన్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచిలో పెట్టి బొటానికల్‌ గార్డెన్‌ వద్ద పడేశారని వివరించారు. 150 సీసీ కెమెరాల్లో పుటేజ్‌ పరిశీలించామని, మడ్‌గార్డ్‌ లేని వాహనం, బ్లూ కలర్‌ టీషర్ట్‌ నిందితుడ్ని పట్టించాయని వివరించారు. మృతురాలి పేరు బింగి అలియాస్‌ పింకి అని తెలిపారు. బీహార్‌కు చెందిన పింకీకి 15 ఏళ్ల క్రితం దినేష్‌ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, ఆ తర్వాత 2017లో అతని నుంచి విడిపోయి వికాస్‌తో సహజీవనం చేసిందని వివరించారు. వికాస్‌ కొంతకాలం పింకీతో ఉండి ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చేశాడని, హైదరాబాద్‌లో అమర్‌కాంత్‌ ఝా కుటుంబంతో కలిసి ఉంటున్నాడని వివరించారు. వికాస్‌ను వెతుక్కుంటూ పింకీ కూడా హైదరాబాద్‌ వచ్చిందన్నారు. ఇక్కడికి వచ్చాక అమర్‌కాంత్‌ ఝా తల్లి మమతా ఝాతో వికాస్‌కు ఉన్న వివాహేతర సంబంధాన్ని పింకీ ప్రశ్నించిందని వివరించారు. గొడవ జరగడంతో పింకీ దవడపై మమతా ఝా కొట్టిందని, మమతా ఝా కొట్టిన దెబ్బలతో పింకి చనిపోయిందని తెలిపారు. ఈ హత్యకు మమతా ఝా భర్త అనిల్‌ ఝా, కుమారుడు అమర్‌కాంత్‌ ఝా సహకరించారని వివరించారు. హత్య అనంతరం పింకి మృతదేహాన్ని ఎలక్ట్రికల్‌ కట్టర్‌తో ముక్కలు ముక్కలు చేశారని వివరించారు.