మిథాలీ అద్భుత ఇన్నింగ్స్.. టీ20ల్లో భారత్ శుభారంభం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:50 AM
 

దక్షిణాఫ్రికా గడ్డపై వన్డే సిరీస్ నెగ్గిన భారత మహిళల జట్టు.. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ శుభారంభం చేసింది. మిథాలీ రాజ్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో మంగళవారం జరిగిన తొలి టీ20లో ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. ముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లక్ష్యం భారీగానే ఉన్నప్పటికీ టీమిండియా మరో ఏడు బంతులు మిగిలి ఉండగానే విజయ తీరాలకు చేరుకుంది. మిథాలీరాజ్‌ (48 బంతుల్లో 54 రన్స్; 6 ఫోర్లు 1 సిక్సర్‌) అజేయంగా నిలవగా.. రోడ్రిక్స్‌(37), వేద కృష్ణమూర్తి(37) రాణించారు.


ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 26 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. కానీ డానే వాన్‌ నీకెర్క్‌ (38), ట్రయాన్‌ (32), డు ప్రీజ్‌ (31) రాణించడంతో 165 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టీమిండియా బౌలర్లలో అనుజ పాటిల్‌ 2 వికెట్లు తీయగా.. శిఖా పాండే, వస్త్రకార్‌ తలో వికెట్ పడగొట్టారు. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం జరగనుంది.