మేఘాలయ ఎన్నికల్లో ఓటేయనున్న ఇటలీ, అర్జెంటీనా, స్వీడన్, గోవా..!

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 08:52 AM
 

మేఘాలయ రాష్ట్రంలో ఫిబ్రవరి 27న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో ఇటలీ, అర్జెంటీనా, ఇండోనేషియా, స్వీడన్‌ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నాయి. అంతేకాదు.. త్రిపుర, గోవా కూడా ఓటు వేస్తాయి. మేఘాలయలో ఎన్నికలైతే.. పక్క రాష్ట్రాలు, విదేశాలు ఓటింగ్‌లో పాల్గొనడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా..! ఎన్నికల అధికారులు కూడా ఇలాగే ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత అసలు విషయం తెలిసి కడుపు చెక్కలయ్యేలా నవ్వుకున్నారు. ఇంతకీ ఈ ఉదంతం వెనుక ఉన్న రహస్యమేంటో చూడండి..మేఘాలయలోని తూర్పు ప్రాంతం కొండ ప్రాంతాలకు ప్రసిద్ధి. ఇక్కడ ఖాసీ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తున్నారు. ఖాసీ కొండల తూర్పు ప్రాంతంలో ఉమ్నిహ్, తమర్, ఎలక లాంటి చిన్న చిన్న గ్రామాలున్నాయి. ఇండియా-బంగ్లాదేశ్ సరిహద్దుకు అత్యంత సమీపంగా ఉండే ఈ గ్రామాల్లోని ప్రజల పేర్లన్ని వింతే.సాధారణ పేర్లకు ఏమాత్రం సంబంధం లేకుండా.. రాష్ట్రాలు, దేశాలు, టేబుళ్లు, బల్లల పేర్లు ధ్వనించేలా ఖాసీ ప్రజల పేర్లు ఉంటాయి. ఇక్కడి ప్రజల పేర్లకు ఆంగ్లంలో వింతగొలిపే అర్థాలు స్ఫురిస్తాయి. అసలు కొన్ని పేర్లకు సరైన అర్థాలే లేకపోవడం మరో విచిత్రం.గోవా, అర్జెంటీనా, స్వీడన్, టేబుల్, పేపర్, స్వెటర్, గ్లోబ్.. ఇలా అక్కడి ఓటర్ల పేర్లన్నీ వింతే. మరో చిత్రమైన విషయం ఏంటంటే.. ‘స్వెటర్’ అనే ఓ తల్లి తన బిడ్డకు ‘నేను ప్రసవించాను’ అనే పేరు పెట్టింది. ఖాసీ పేర్లకు ఇంగ్లిష్‌లో అర్థాలు వెతికితే ఇలాంటి వింతలు బయటపడ్డాయి. ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాను బయటపెట్టడంతో ఈ చిత్ర విచిత్రమైన పేర్లన్నీ హాట్ టాపిక్‌గా మారాయి.