భారత్‌పై ట్రంప్‌ అసంతృప్తి

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 11:48 AM
 

వాషింగ్టన్‌: అమెరికాకు చెందిన హార్లీ-డేవిడ్‌సన్‌ మోటారుసైకిళ్ల దిగుమతిపై భారత్‌ అధిక సుంకం వసూలు చేస్తోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇది అంత మంచిది కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇది ఇలాగే ఉంటే భారత్‌ నుంచి అమెరికాకు దిగుమతయ్యే మోటార్‌సైకిళ్లపైనా సుంకాన్ని పెంచుతామని హెచ్చరించారు. స్టీల్‌ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై కాంగ్రెస్‌ సభ్యులతో సమావేశమైన ట్రంప్‌ భారత్‌పై ఈ వ్యాఖ్యలు చేశారు.  


అయితే తాజాగా భారత్‌ వీటిపై కస్టమ్స్‌ సుంకాన్ని మరింత తగ్గించింది. విదేశాల్లోనే పూర్తిగా తయారై దిగుమతి చేసుకునే ఈ బైక్‌లపై  ప్రాథమిక సుంకాన్ని 50 శాతానికే పరిమితం చేసింది. గతంలో ఇది 800సీసీ అంతకన్నా తక్కువ సామర్థ్యం గల బైక్‌లపై 60శాతం, 800సీసీ అంతకన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై 75శాతం సుంకం ఉంది. అయితే దీన్ని 50 శాతానికి తగ్గించిన తర్వాత ట్రంప్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


ఇటీవల భారత ప్రభుత్వం హార్లీడేవిడ్‌సన్‌ బైక్‌లపై టారిఫ్‌ను 75శాతం నుంచి 50శాతానికి తగ్గించింది. కానీ ఇది సరిపోదు అని ట్రంప్‌ అన్నారు. అమెరికా భారత్‌ నుంచి దిగుమతి చేసుకునే బైక్‌లకు సుంకాన్ని విధించడంలేదని, భారత్‌ మాత్రం అధిక సుంకం వేస్తోందన్నారు. ఇలా ఉండకూడదని.. పరస్పరం ఒకేలా ఉండాలని పేర్కొన్నారు. చాలా దేశాలతో ఇలాగే జరుగుతోందన్నారు. తమ బైక్‌లు ఇతర దేశాల్లోకి వెళ్లాలంటే పెద్ద మొత్తంలో సుంకం చెల్లించాల్సి వస్తోందన్నారు. ఇరు వైపులా ఒకేలా సుంకాలు చెల్లించేలా ‘రెసిప్రోకల్‌ ట్యాక్స్‌’ విధానం ఉండాలని వెల్లడించారు.


 


ట్రంప్‌ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయినప్పుడు జరిగిన సంభాషణను కూడా పరోక్షంగా ప్రస్తావించారు. ‘భారత్‌ నుంచి ఓ గొప్ప జెంటిల్‌మెన్‌ ఫోన్‌ చేశారు.. మోటార్‌సైకిళ్లపై టారిఫ్‌ను 75శాతం, 100శాతం నుంచి కేవలం 50శాతానికి తగ్గించేశామని చెప్పారు. అయితే అమెరికాకు భారత్‌ నుంచి వేల సంఖ్యలో బైక్‌లు దిగుమతి అవుతున్నాయి.. కానీ వీటికి మనం విధించే సుంకం ఎంతో తెలుసా.. సున్నా ’అని శాసనకర్తలనుద్దేశించి ట్రంప్‌ అన్నారు. అందుకే తాను రెసిప్రోకల్‌ ట్యాక్స్‌ ఉండాలని అంటున్నానని చెప్పారు. తాను భారత్‌ను నిదించట్లేదని.. ఉదాహరణ కోసం చెప్పానని చెప్పుకొచ్చారు. అమెరికా విధానాన్ని అవకాశంగా తీసుకుని ఇతర దేశాలు లాభపడుతున్నాయి.. అలా కాకుండా ఇరు దేశాల నుంచి పరస్పరం ఒకేలా సుంకాలు వసూలు చేసుకునే విధానం ఉండాలని ట్రంప్‌ అభిప్రాయ పడ్డారు.a