పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 11 వేల కోట్ల కుంభకోణం

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 14, 2018, 01:46 PM
 

ముంబైః అసలే వసూలు కాని వేల కోట్ల రుణాలతో కునారిల్లుతున్న భారత బ్యాంకింగ్ వ్యవస్థకు మరో షాకింగ్ న్యూస్. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌కు చెందిన ఓ ముంబై బ్రాంచ్‌లో ఏకంగా రూ.11360 కోట్ల కుంభకోణం జరిగింది. ఈ విషయాన్ని ఆ బ్యాంకే బుధవారం వెల్లడించింది. ఇది ఇతర బ్యాంకులపై కూడా తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు తెలిపింది. ముంబైలోని ఆ బ్రాంచ్‌లో కొన్ని మోసపూరిత, అనధికారికి లావాదేవీలు జరిగినట్లు పీఎన్‌బీ గుర్తించింది. కొందరు ఖాతాదారుల కోసమే ఈ లావాదేవీలు జరిగాయి. ఈ లావాదేవీల ఆధారంగా విదేశాల్లోని సదరు ఖాతాదారుల అకౌంట్లలోకి ఇతర బ్యాంకులు కూడా భారీగా సొమ్మును ట్రాన్స్‌ఫర్ చేసినట్లు పీఎన్‌బీ ఓ ఎక్స్‌చేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఈ కుంభకోణంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించలేదు. ఈ స్కాంపై విచారణ సంస్థలకు సమాచారం ఇచ్చినట్లు పీఎన్‌బీ స్పష్టంచేసింది. 


తమ బ్యాంక్ ఆర్థిక పరిస్థితిపై ఈ స్కాం ఎలాంటి ప్రభావం చూపుతుందో పీఎన్‌బీ చెప్పలేదు. ఇక ఆ ఖాతాదారులకు డబ్బు జమ చేసిన ఇతర బ్యాంకుల వివరాలు కూడా వెల్లడించలేదు. ఈ లావాదేవీలను మళ్లీ రివర్స్ చేస్తారా, విచారణ సంస్థలు వీటిని తిరిగి రాబడతాయా అన్నదానిపై ఇప్పుడే స్పష్టంగా ఏమీ చెప్పలేమని ముంబైకి చెందిన బ్యాంకింగ్ అనలిస్ట్ అశుతోష్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ కుంభకోణం విలువ 2017లో పీఎన్‌బీ నికర ఆదాయానికి 8 రెట్లు కావడం గమనార్హం. ఈ విషయం బయటకు రాగానే ఇవాళ పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్లు ఏడున్నర శాతం వరకు పడిపోయాయి. ఈ స్కాం తమపై ఎలాంటి ప్రభావం చూపబోతున్నదో ప్రస్తుతం పీఎన్‌బీ లెక్కలేసే పనిలో ఉంది.