ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చెవుల్లో ఇయర్‌ఫోన్లు ఉండేవారిపై పోలీస్‌ నిఘా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 17, 2018, 10:23 AM

రహదారులపై ప్రమాదాలు తగ్గించేందుకు కృషి చేస్తున్న ట్రాఫిక్‌ పోలీసులు వాహనదారులు, నిబంధనలు ఉల్లంఘించేవారు, మందుబాబులపై దృష్టి సారించారు. ఎక్కువగా ప్రమాదాలు ఎవరు చేస్తున్నారో విశ్లేషించారు. ద్విచక్రవాహనదారులే ప్రమాదాలకు కారణమవుతున్నారని, బాధితులు కూడా వారే అవుతున్నారని గుర్తించారు. ఇందుకు కారణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించగా... అపసవ్య దారిలో రావడం, ప్రమాదకరంగా వాహనాలు నడపడంతో పాటు ఎక్కువమంది ద్విచక్రవాహనాలు నడిపేప్పుడు చెవుల్లో ఇయర్‌ ఫోన్లు ధరించి వెళ్తున్నారని... దీంతో డ్రైవింగ్‌పై ధ్యాస ఉంచడం లేదని గుర్తించారు. వీరిలో చాలా మంది ప్రమాదాలు చేస్తుండడంతో వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. జరిమానాలు విధిస్తే వాటిని చెల్లించి అలాగే ప్రవర్తిస్తారన్న అంచనాతో వారిపై న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు. జైలుకు పంపుతున్నారు.


చెవుల్లో ఫోన్లు... పాటలపై ధ్యాస.. 


హైదరాబాద్‌ సహా మెట్రోనగరాల్లో ఇటీవల వాహనదారుల శైలి మారిపోయింది. వాహనాల రద్దీ, రణగొణ ధ్వనులతో ప్రయాణించేందుకు ఇష్టం లేక చెవుల్లో ఫోన్లు పెట్టుకొంటున్నారు. ఎవరైనా ఫోన్‌ చేసినా డ్రైవింగ్‌ చేస్తూనే సమాధానం ఇవ్వడం, ఫోన్లు రానప్పుడు సినిమాపాటలు వినడం, మొదట్లో ఇది బాగానే ఉన్నా...  వాహనదారులు సంగీతంపైనే ధ్యాస ఉంచడంతో సరైన దృష్టితో వాహనాలు నడపడం లేదు. పాటలు వింటూ, ఫోన్‌లో మాట్లాడుతూ కుడి, ఎడమలు చూసుకోకుండా నేరుగా వెళ్లడం, ఒక్కోసారి ఉన్నట్టుండి మలుపులు తీసుకోవడంతో ప్రమాదాలవుతున్నాయి. కొందరు ప్రమాదాల బారినపడి మరణిస్తుండడంతో ఈ తరహా డ్రైవింగ్‌ చేసే వారిపై ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. చెవుల్లో ఫోన్లు పెట్టుకొని డ్రైవింగ్‌ చేస్తున్న చోదకుల ఫొటోలు తీసి జరిమానాలు విధించడంతో పాటు న్యాయస్థానాల్లో అభియోగపత్రాలు దాఖలు చేస్తున్నారు.


 


తనతోపాటు ఇతరులకూ ప్రమాదమే 


సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు జాతీయ రహదారులు, మెట్రోనగరాల్లో ప్రమాదాలు నియంత్రించేందుకు  పోలీస్‌, రవాణా, వైద్యారోగ్య శాఖలు, రహదారి భద్రతా విభాగం సంయుక్తంగా చర్యలు చేపట్టాయి. తరచూ నమోదవుతున్న ప్రమాదాలు, సంఘటన స్థలాలను పరిశీలించిన పోలీస్‌ అధికారులు మోటార్‌ వాహన చట్టం ఆధారంగా కేసులు నమోదు చేయడంతో పాటు వారిపై అభియోగ పత్రాలు నమోదు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎం.వి.యాక్ట్‌ 180 నుంచి 190 సెక్షన్ల వరకూ ఉన్న ఉల్లంఘనలన్నింటినీ పరిశీలించారు. వాహనదారుడితో పాటు ఇతరులకు ప్రమాదం కలిగించే డ్రైవింగ్‌పై కఠిన చర్యలు చేపట్టారు. 


* ద్విచక్రవాహనం, కార్లపై వెళ్లే యువకులు ప్రమాదకరంగా నడిపితే వారితోపాటు ఎదురుగా, పక్కన వెళ్తున్న వారికీ ఇబ్బందులే. ఒక్కోసారి వాహనదారులు, పాదచారులు ప్రాణాలు కోల్పోతున్నారు. 


* వేగనియంత్రణలున్నా వంద మైళ్ల వేగంతో కార్లు, బైకులపై దూసుకు వెళ్తున్న యువకులు చాలామంది వేగాన్ని నియంత్రించుకోలేక ప్రమాదాల బారినపడుతున్నారు. విపరీత విన్యాసాలు చేసి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. 


* చోదక అనుమతి లేకున్నా బైకులు, కార్లు నడుపుతున్న మైనర్లు, యువకులు తడబడి ప్రమాదాలు చేస్తున్నారు. వీరితో పాటు వాహన యజమానులపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో అభియోగపత్రాలు సమర్పిస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com