భారత మాజీ కెప్టెన్, వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోనీ ప్రపంచ క్రికెట్లో అరుదైన ఘనతలను సొంతం చేసుకుంటున్నాడు. తన మెరుపు కీపింగ్‌తో అభిమానులను అలరిస్తున్నాడు. ఆదివారం సౌతాఫ్రికాతో తొలి టీ20 మ్యాచ్‌లో టీ20ల్లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. సఫారీ ఇన్నింగ్స్‌లో భువనేశ్వర్ కుమార్ వేసిన 18వ ఓవర్ తొలి బంతిని ఆడిన హెండ్రిక్స్ ధోనీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో గతంలో శ్రీలంక స్టార్ క్రికెటర్ కుమార సంగక్కర పేరిట ఉన్న అత్యధిక క్యాచ్‌ల రికార్డును తాజాగా ధోనీ అధిగమించాడు. కెరీర్లో 275వ టీ20 మ్యాచ్ ఆడిన ధోనీ 134 క్యాచ్‌లు అందుకొని అగ్రస్థానంలో నిలిచాడు.
గతంలో సంగక్కర 254 మ్యాచ్‌ల్లో 133 క్యాచ్‌లు పట్టి తొలి స్థానంలో కొనసాగుతుండగా అతని రికార్డును తాజాగా మహీ బ్రేక్ చేశాడు. మూడో స్థానంలో భారత ఆటగాడు దినేశ్ కార్తిక్(227 మ్యాచ్‌ల్లో 123 క్యాచ్‌లు), పాకిస్థాన్ క్రికెటర్ కమ్రాన్ అక్మల్( 211 టీ20ల్లో 115 క్యాచ్‌లు), వెస్టిండీస్ కీపర్ దినేశ్ రామ్‌దిన్( 168 మ్యాచ్‌ల్లో 108 క్యాచ్‌లు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాళ్ల జాబితాల్లో ధోనీది మూడోస్థానం. ధోనీ ఇప్పటి వరకు 601 క్యాచ్‌లు, 174 స్టంపింగ్‌లు చేశాడు.