సామాజిక మాధ్యమం ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువకుడిని ఆమె స్నేహితుడని నమ్మింది. అతడి మనసులోని దురాలోచనను ఊహించలేకపోయింది. ఇంటికి రమ్మని పిలిస్తే అమాయకంగా వెళ్లింది. అంతే.. మృగంలా మారిన అతడు లైంగికవాంఛ తీర్చాలని బలవంతపెట్టడంతో ఆమె ప్రతిఘటించింది. దీంతో బూటు తాడు(లేసు)ను ఆమె మెడకు బిగించి అమానుషంగా హతమార్చాడు. మహారాష్ట్రలోని నల్లాసొపారాలో ఆదివారం చోటు చేసుకున్న ఈ దారుణ ఘటనలో హరిదాస్ నిర్గుడే (25) అనే వ్యక్తి అంకిత మోరే (20)ను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన అనంతరం మృతదేహాన్ని సమీపంలో పడేసి వెళ్లిపోగా.. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించినట్లు పోలీసు అధికారి ఒకరు తెలిపారు.