ముదురుతోన్న వివాదం: ఆప్ ఎమ్మెల్యే అరెస్ట్, 'దాడి'లో నిజమెంత?

  Written by : Suryaa Desk Updated: Wed, Feb 21, 2018, 10:25 AM
 

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వానికి అధికారులకు మధ్య పెద్ద యుద్దమే నడుస్తోంది. అప్పట్లో గవర్నర్ నజీబ్ జంగ్‌తో కేజ్రీవాల్ వివాదాన్ని తలపించేలా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే ప్రకాష్ జర్వాల్ తనపై దాడి చేశారని ఢిల్లీ చీఫ్ సెక్రటరీ ఫిర్యాదు చేయడంతో.. గురువారం రాత్రి పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు.


ఆమ్ ఆద్మీ ఢిల్లీ అధికార ప్రతినిధి సౌరభ్ భరద్వాజ్ ప్రకాష్ అరెస్టుపై ట్వీట్ చేశారు. 'ఎటువంటి ఆధారం లేకుండానే ఢిల్లీ పోలీసులు ఒక ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారు. మరి సెక్రటేరియట్ లోనే మంత్రిపై దాడి చేసిన ఐఏఎస్ అధికారుల సంగతేంటి?. ఆ మంత్రి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినా, వీడియో ఆధారాలు సమర్పించినా.. ఇప్పటికీ ఒక్క అరెస్ట్ లేదు' అంటూ ట్వీట్‌లో వెల్లడించారు.సోమవారం రాత్రి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఒక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే సమావేశం సందర్భంగా ఎమ్మెల్యేలు ప్రకాష్ జర్వాన్, అమన్ తుల్లా ఖాన్ తనపై దాడి చేశారని చీఫ్ సెక్రటరీ అన్షు ప్రకాష్ ఆరోపించారు. దీనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎమ్మెల్యే ప్రకాష్ జర్వాన్ ను అరెస్ట్ చేశారు.చీఫ్ సెక్రటరీ ఆరోపణలను ఖండించిన ఆప్ ఎమ్మెల్యేలు జర్వాల్, అజయ్ దత్, అలాగే డియోలి, అంబేడ్కర్ నగర్ ఎమ్మెల్యేలు ప్రత్యారోపణలు చేశారు. అన్షు ప్రకాష్ తమపై కుల వివక్ష కామెంట్స్ చేశారని ఆరోపించారు. దీనిపై ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా.. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్‌కు సైతం ఫిర్యాదు చేశారు.చీఫ్ సెక్రటరీపై దాడిని ఐఏఎస్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఢిల్లీ గవర్నర్ అనిల్ బాలాజీని కోరింది. అసోసియేషన్ సెక్రటరీ మనీషా సక్సెసా మాట్లాడుతూ.. చీఫ్ సెక్రటరీపై దాడిని ఒక కుట్ర అని అభివర్ణించారు.