కరీంనగర్ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని(నరేగా) వ్యవసాయాన్ని అనుసంధానం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్ చేశారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో నిర్వహించిన రైతు సమన్వయ సమితి ప్రాంతీయ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్.. రైతు సమన్వయ సమితుల సభ్యులకు దిశానిర్దేశం చేశారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ.. రైతులతో సీఎం ఏకగ్రీవ తీర్మానం చేయించారు. ఈ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరామని గుర్తు చేశారు. కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే దేశంలో రైతుల తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉందన్నారు. కేంద్రం మీద కచ్చితంగా ఒత్తిడి పెంచాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రైతుల పక్షాన పోరాడాలని తమ ఎంపీలను కోరుతున్నానని పేర్కొన్నారు. దేశ రైతాంగానికి తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వం వహించే పరిస్థితి రావాలన్నారు. రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. కానీ అందరం కలిస్తేనే గమ్యం చేరుకోగలమని చెప్పారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉందని తెలిపారు. తెలంగాణలో కోటి 60 లక్షల ఎకరాలకు పైగా సాగులో ఉందని వెల్లడించారు. రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్లే వచ్చిందన్నారు. దేశ రైతులను అర్థం చేసుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్ దారుణంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు లభ్యమవుతున్నప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు. రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణలో కరెంట్ పోయే ప్రశ్న రానివ్వమని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని ఉమ్మడి రాష్ట్రంలో పలువురు అపోహలు కల్పించారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ధర్నాలు చేయడం చూస్తూనే ఉన్నామని చెప్పారు. టీడీపీ కరెంట్ తేలేదు.. కాంగ్రెస్ కరెంట్ తేలేదు.. కరెంట్ తెచ్చింది గులాబీ జెండానే అని సీఎం స్పష్టం చేశారు. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్.. చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. తెలంగాణ వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా గోదావరిలో వాటా తేలలేదు అని గుర్తు చేశారు. గోదావరి, కావేరి అనుసంధానం పేరిట కేంద్రం డ్రామాలు ఆడుతుందని సీఎం నిప్పులు చెరిగారు. పాడి - పంట సంవృద్ధిగా ఉంటేనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. అడ్డం పొడుగు తెలియనోళ్లంతా రైతు సమన్వయ సమితి గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతు సమన్వయ సమితికి స్థానిక సంస్థలకు సంబంధం లేదని స్పష్టం చేశారు. వ్యవసాయానికి సరిపడా భూమి, కరెంట్ ఉంది.. నీళ్లు, ఎరువులు, విత్తనాలు ఉన్నాయి. ఈ బడ్జెట్‌లో భారీ నీటిపారుదల శాఖకు భారీగా నిధులు కేటాయించబోతున్నామని సీఎం వెల్లడించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa