మహారాష్ట్రలోని పాల్‌గఢ్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గురువారం రాత్రి ఓ రసాయన కర్మాగారంలో భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 13 మంది గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. పేలుడు శబ్దం కంపెనీకి దాదాపు పది కిలోమీటర్ల దూరం వరకు వినిపించిందని, ఇళ్లు, భవనాలు కంపించాయని పోలీసులు వెల్లడించారు. అయితే పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
రామేదేవ్ కెమికల్ ప్లాంట్‌లోని బాయిలర్ గదిలో ఈ భారీ పేలుడు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రసాయన కర్మాగారం పక్కన ఉన్న ఇతర కంపెనీలకు కూడా మంటలు విస్తరించాయని, ఈ కంపెనీల్లో రసాయనాలతో కూడిన డ్రమ్ములు ఉండడం వల్ల మంటలు విస్తరిస్తున్నాయని పాల్‌గఢ్ ఎస్పీ మంజునాథ్ తెలిపారు.
అగ్నిప్రమాదం జరిగిన ప్రదేశానికి 20కిలోమీటర్ల దూరంలో తారాపూర్ అటామిక్ పవర్ స్టేషన్ ఉంది. పెద్ద బాంబు పేలినట్లుగా కనిపించిందని ప్రత్యక్షంగా చూసిన వారు చెప్పారు. ఈ ప్రమాదంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లు, భవనాలు కంపించడంతో స్థానికులు ఒక్కసారిగా భూకంపం వచ్చిందేమోనని భయపడి అంతా ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. వందలాది మంది రాత్రి రోడ్డపై కూర్చున్నారు.