ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అసలుకే ఎసరుపెడుతున్న ఆటోమెటిక్‌ స్టార్టర్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 09, 2018, 11:40 AM

పైన ఫొటో చూడండి.. పశువులు మేస్తున్న ఎండిన పంట నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం సర్వారంలోనిది. ఈ గ్రామంలో 350 ఎకరాల్లో ఈ సీజన్‌లో వరి సాగు చేశారు. సీజన్‌ ప్రారంభంలో డీ–40 కాల్వ ద్వారా నీరు విడుదల చేయడంతో రైతులు వరి పంటలను సాగు చేశారు. అయితే కాల్వ ద్వారా నీటి విడుదల నిలిచిపోవడంతో పరిస్థితి తారుమారు అయ్యింది. భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయి. బోర్లలో నీరు రాకపోవడంతో  సాగు చేసిన వరి చేలు ఎండి పోతున్నాయి. మరో నెల రోజుల్లో పంటలు చేతికి వచ్చే సమయంలో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. ఈ గ్రామంలో 200 ఎకరాల వరకు వరి ప్రస్తుతం పూర్తిగా ఎండి పోయింది. దీంతో కొంతమంది రైతులు కొత్తగా బోర్లు వేసి ఫలితం లేక చేతులు కాల్చుకుంటున్నారు. చేసేది లేక పశువులను మేపుతున్నారు. 


వానాకాలం అంతగా కలిసి రాకపోవడంతో యాసంగి పంటపైనే రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయిలో 24 గంటల విద్యుత్‌ సరఫరా చేస్తుండడంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేశారు. కరెంటు ఫుల్‌గా ఉన్నా, సరిపడా నీరందక కళ్లముందే పంటలు ఎండిపోతుంటే రైతులు బోరుమంటున్నారు. నల్లగొండ జిల్లాలో గత ఏడాది ఫిబ్రవరిలో 10.91 మీటర్లపైనే నీరందగా, వినియోగం విచ్చలవిడిగా పెరగడంతో ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి భూగర్భజలమట్టం 11.30 మీటర్ల లోతుకు పడిపోయింది. నెల రోజుల్లో యాదాద్రి జిల్లా పరిధిలో రెండు మీటర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ఆటో స్టార్టర్లతో నడుస్తున్న మోటార్లు కాలిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటిన నేపథ్యంలో పంటను కాపాడుకోవాలనే తపనతో రైతులు విచ్చలవిడిగా బోర్లు వేస్తున్నారు.గత యాసంగి సీజన్‌ కంటే ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం, విద్యుత్‌ వినియోగం  పెరిగిపోయాయి. సాగర్, మూసీ ఆయకట్టును మినహాయిస్తే ఉమ్మడి జిల్లాలో భూగర్భజలంపై ఆధారపడే రైతులే ఎక్కువ. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో 3.87లక్షల పైచిలుకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లు ఉన్నాయి. ఒక్క నల్లగొండ పరిధిలోనే గత ఏడాది ఫిబ్రవరిలో 297 మిలియన్‌ యూనిట్లు విద్యుత్‌ను వినియోగిస్తే.. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 466 మిలియన్‌ యూనిట్లకు పెరిగింది. అదేస్థాయిలో సాగు విస్తీర్ణం కూడా పెరిగిపోయింది. నల్లగొండలో గతేడాది యాసంగిలో 57వేల హెక్టార్లలో సాగు చేస్తే, ఈ సారి 74వేల హెక్టార్లకు పెరిగిపోయింది.


సూర్యాపేట జిల్లాలో గతేడాది 74వేల హెక్టార్లలో సాగుచేయగా, ఈ సారి 80వేల హెక్టార్లకు పెరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఈ యాసంగిలో 25వేల హెక్టార్లలో వరి సాగైంది. దీంతో నిరంతరం విద్యుత్‌ వాడుతున్న ఫలితంగా బోర్లు వట్టిపోయి పంటలు ఎండిపోతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తుంగతుర్తి, తిరుమలగిరి, అర్వపల్లి, నూతనకల్, నాగారం, మద్దిరాల మండలాల పరిధిలో 7240 ఎకరాల్లో వరిపంట సాగు చేయగా ఇప్పటికే 50 శాతం పొలాలు ఎండిపోయాయి. తమ పంటలు ఎండిపోవడానికి కారణం 24గంటల విద్యుత్‌ అని రైతులు వాపోతున్నారు. 24 గంటల విద్యుత్‌ వద్దని రైతులు గ్రామాల్లో రాస్తారోకో, ధర్నాలు చేస్తున్న విషయం విదితమే.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa