రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. వేసవి ప్రారంభంలోనే, మార్చి నెల తొలి వారం నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మధ్యాహ్నం వేళల్లో భగభగ మండుతున్న ఎండల్ని చూసి ప్రజలు ఇళ్లల్లోంచి బయటికి వచ్చేందుకే భయపడుతున్నారు. ఈ వేసవిలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒక డిగ్రీ సెల్సియస్ ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉన్నట్టు హైదరాబాద్ వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని రోజుల్లో రికార్డు స్థాయికి గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. కొన్ని దశబ్దాలుగా పెరుగుతున్న పట్టణీకరణ, పారిశ్రామీకరణతో కాలుష్యం అధికమవుతోందని, ఈ కారణంగానే ఉష్ణోగ్రతల్లోనూ పెరుగుదల నమోదవుతోందని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు. భూతాపం పెరగడంతో ప్రపంచవ్యాప్తంగా 1900 నుంచి ఇప్పటివరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 0.9 డిగ్రీల నుంచి ఒక డిగ్రీ సెల్సియస్ మేర పెరిగినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి అధికారులు తెలిపారు. యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ స్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యయనం ప్రకారం దశాబ్దానికి సగటున ఉష్ణోగ్రత 0.17 డిగ్రీల సెల్సియస్ పెరుగుతోంది. నాసా లెక్కల ప్రకారం1951 నుంచి 1980 మధ్య నమోదైన సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే 2017లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 0.9 డిగ్రీల సెల్సియస్ పెరిగింది. కాలుష్యాన్ని తగ్గించే చర్యలపై దృష్టి పెట్టకపోతే ఉష్ణోగ్రతలు మరింత పెరిగి ముప్పువాటిల్లే ప్రమాదాలు ఉన్నట్టు వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa