బరువు తగ్గాలనుకుంటున్నారా.. సీబీఐకి ఫోన్ చేయండి

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 01:56 PM
 

మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా... జిమ్‌కు వెళ్లక్కర్లేదు... గ్రౌండ్‌లో పరుగులు పెట్టాల్సిన అవసరం లేదు... ఏం తినకుండా కడుపు మాడ్చుకోవాల్సిన పని లేదు. చాలా సింపుల్... ఒకే ఒక్క ఫోన్ కాల్ చేస్తే చాలట. అది కూడా సీబీఐకి. ఇదేంటి బరువు తగ్గడం కోసం సీబీఐకి ఫోన్ చేయడానికి సంబంధమేంటని ఆలోచిస్తున్నారా. అక్కడే ఓ కిటుకు ఉందంటున్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కుమారుడు కార్తీ. సీబీఐ కస్టడీలో ఉంటూ వారి క్యాంటిన్ తిండి తింటే చాలు. వెంటనే బరువు తగ్గిపోతారట. ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న తాను చాలా తక్కువ తింటున్నారు. చాలా బరువు తగ్గిపోయారట. పాత బట్టలు లూజ్ అయిపోయాయి... కొత్తవి కొనాలని చెప్పుకొచ్చారట. కోర్టకు హాజరైన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారట.


ఐఎన్‌ఎక్స్ కేసులో సీబీఐ కస్టడీలో ఉన్న కార్తీ చిదంబరంను తీహార్ జైలుకు పంపించారు. అయితే తన భద్రత దృష్ట్యా తీహార్ జైల్లో తనకు ప్రత్యేక గదిని, బాత్‌రూమ్‌ని కేటాయించాలని కోర్టును కోరారు. అయితే కోర్టు ఈ అభ్యర్థనను తిరస్కరించారు. జైలు అధికారులే కార్తీ భద్రతకు హామీ ఇవ్వాలని ఆదేశించారు. తాము నిబంధనల మేరకే నడుచుకుంటామని... ఒకవేళ కోర్టు ఆదేశిస్తే ఇంటి నుంచి వచ్చే ఆహారాన్ని అనుమతిస్తామని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి.