ఆ ముఠా నాయకుడు జానారెడ్డి : జగదీశ్ రెడ్డి

  Written by : Suryaa Desk Updated: Tue, Mar 13, 2018, 03:44 PM
 

హైదరాబాద్ : కాంగ్రెస్ సభ్యులపై మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిన్న శాసనసభలో కాంగ్రెస్ నేతలు దుర్మార్గంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. ఈ దుర్మార్గమైన ముఠాకు జానారెడ్డి నాయకుడిగా ఉన్నారని ఆరోపించారు. ఇవాళ అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మంత్రి జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీరు టెర్రరిస్టులను తలపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల తీరు సరైంది కాదన్నారు. స్పీకర్ తన అధికారాల మేరకే కాంగ్రెస్ సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారని స్పష్టం చేశారు. ముఠాకు నాయకుడిగా వ్యవహరించిన జానారెడ్డి ఇవాళ తననెందుకు సస్పెండ్ చేశారని అమాయకంగా ప్రశ్నిస్తున్నారు. జానారెడ్డి నాయకత్వంలోనే కుట్ర చేసి దాడికి పాల్పడ్డారని మంత్రి ఆరోపించారు. సభలో దాడుల వల్ల రాష్ట్ర ప్రతిష్టకు భంగం కలుగుతదని జానారెడ్డి తన తోటి సభ్యులకు చెప్పలేకపోయిండు. ప్రతి సందర్భంలోను గవర్నర్‌తో పాటు స్పీకర్, చైర్మన్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించారు. స్వామిగౌడ్‌పై దాడి చేసిన అనంతరం.. కొంతమంది సభ్యులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో షేక్‌హ్యాండ్ చేసుకోవడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దాడి తర్వాత కాంగ్రెస్ సభ్యులు నవ్వుకున్నారు. టెర్రరిస్టులా మాదిరి కాంగ్రెస్ సభ్యులు ప్రవర్తించారని మంత్రి జగదీశ్ రెడ్డి దుయ్యబట్టారు.