నేటి నుంచి చర్లపల్లి జైలులో పంచకర్మ చికిత్సలు

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 08:43 AM
 

చర్లపల్లి : ఇప్పటికే సేంద్రియ సేద్యం తదితర పనులతో ఆదర్శప్రాయంగా నిలుస్తున్న చర్లపల్లి జైలు.. తాజాగా రోగుల సాంత్వన కోసం నేడు ఆయుర్వేదగ్రామాన్ని ప్రారంభిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ఖైదీలకు తగిన శిక్షణ ఇప్పించిన అధికారులు అన్నిరకాల ఆయుర్వేద చికిత్సలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. చర్లపల్లి వ్యవసాయక్షేత్రం(ఓపెన్ ఎయిర్ జైలు)లో ఖైదీల సంక్షేమానికి అధికారులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. వ్యవసాయక్షేత్రంలో ఖైదీలు సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులను సాధిస్తూ తక్కువ ధరలకు కూరగాయాలు, వివిధ రకాల పండ్లు, పూలు అందిస్తున్నారు. తాజాగా వ్యవసాయక్షేత్రంలోకి ప్రజలను అనుమతిస్తూ అయుర్వేదిక్ చికిత్సను అందించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చికిత్సాలయాన్ని ఈనెల 14న (నేడు) ప్రారంభిస్తున్నారు. మైనేషన్ పేరిట ఆయుర్వేదిక్ విలేజిని ఏర్పాటు చేసిన అధికారులు కీళ్ల నొప్పులు, సర్వేకల్ స్పాండిలైటిస్, డయాబెటిస్, సోరియాసిస్ వంటి వ్యాధులకు చికిత్సలు అందించడంతోపాటు పంచకర్మ చికిత్సలు, యోగా, ధ్యానం వంటి సేవలను అందుబాటుల్లోకి తీసుకువస్తున్నారు.