నేడు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 08:57 AM
 

హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ నేడు సమావేశం కానున్నది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఎండీడీఎల్ దిగువన నీటి వాడకంపై ఏపీ పట్టుబడుతుండటం.. ఎలాగైనా ఏపీకి అనుకూల నిర్ణయం జరిగేలా కృష్ణాబోర్డు నానా తిప్పలు పడటం.. శ్రీశైలంలో ఎన్ని నీళ్లు వాడుకున్నా సరే! సాగర్‌లో మాత్రం అంగీకరించేది లేదని తెలంగాణ తేల్చి చెప్పిన నేపథ్యంలో బుధవారం త్రిసభ్య కమిటీ సమావేశానికి ప్రాధాన్యమేర్పడింది. జలసౌధలో మధ్యాహ్నం మూడు గంటలకు జరుగనున్న ఈ సమావేశానికి బోర్డు సభ్య కార్యదర్శి, రెండు రాష్ర్టాల ఈఎన్సీలతోపాటు అధికారులు పాల్గొననున్నారు. సరిగా ఈ సమావేశానికి 24 గంటల ముందు మంగళవారం నాడు ఆంధ్రప్రదేశ్ హడావుడిగా బోర్డుకు ఇండెంట్ సమర్పించడం గమనార్హం. వాస్తవంగా సాగర్ ఎండీడీఎల్ దిగువన నీటి వాడకాన్ని తెలంగాణ వ్యతిరేకిస్తుండగా.. అదేదో గతంలోనే అంగీకారం జరిగినట్లుగా ఏపీ ఈఎన్సీ మరో అబద్ధాన్ని తన లేఖలో ప్రస్తావించారు. ఈ క్రమంలో రెండు జలాశయాల్లో ఎండీడీఎల్ దిగువన ఏపీకి 30.38 టీఎంసీలు, తెలంగాణకు 46 టీఎంసీల వాటాకు అంగీకారం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాదు.. తమ వాటా ఉన్న నీటి పరిమాణం సరిపోదని, అదనంగా సాగర్ కుడి కాల్వ కింద 7.5 టీఎంసీలు, కృష్ణా డెల్టా కింద 4.5 టీఎంసీలు కావాలంటూ లేఖ ద్వారా ఇండెంట్ సమర్పించారు.