చంద్రబాబు ట్వీట్‌కు కేటీఆర్ కౌంటర్

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 09:06 AM
 

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఏపీకి ప్రత్యేక హోదా, నిధులు గురించి గతవారం చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్‌ ద్వారా సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. ‘కేంద్ర మంత్రి గారు ఓ మాట అన్నారు... సెంటి మెంట్‌కు డబ్బులు రావు' అని... కానీ ఆయన ఒకటి గుర్తుంచుకోవాలి సెంటి మెంట్ కోసమే 'తెలంగాణ' రాష్ట్రాన్ని ఇచ్చారు’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అయితే దీనికి తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.. ‘సర్.. మాపై మాకు ఎంతో గౌరవం ఉంది... ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను తెలంగాణ ప్రజలు ఎప్పుడూ వదులుకోలేదు.. తమ పోరాటాన్ని నీరుగార్చడానికి ప్రయత్నించారు.. ప్యాకేజీలు ఇస్తామని మభ్యపెట్టినా తీసుకోవడానికి సిద్ధపడలేదు.. మీ హక్కుల కోసం మీరు పోరాటం చేయండి కానీ తెలంగాణ ప్రజల పోరాటం, త్యాగాలను తక్కువచేసి మాట్లాడకండి’ అంటూ రీట్వీట్ చేశాడు.


మరోవైపు నవ్యాంధ్రకు న్యాయం చేయాలంటూ ఏపీ అసెంబ్లీలో మంగళవారం తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం చంద్రబాబు మాట్లాడుతూ... అరుణ్ జైట్లీ చేసిన వ్యాఖ్యలపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. సెంటిమెంట్ ఆధారంగా రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేమని, రాజ్యాంగబద్ధ సంస్థ ఆర్థిక సంఘం సూచనల మేరకే ఆ పని చేస్తామన్న జైట్లీ వ్యాఖ్యలు ఉటంకిస్తూ శాసనసభలో బాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. ‘ప్రత్యేక హోదా ఐదేళ్లపాటు ఇస్తామన్న హామీతోనే పొత్తుపెట్టుకున్నాం... సెంటిమెంట్‌తో తెలంగాణ ఇచ్చారు.. 60 ఏళ్లు కష్టబడిన తర్వాత కట్టుబట్టలతో వచ్చిన వారికి సెంటిమెంట్‌తో నిధులు ఇవ్వరా’ అంటూ కేంద్రాన్ని బాబు నిలదీశారు.