గోరఖ్‌పూర్‌లో భాజపా, ఫుల్‌పూర్‌లో ఎస్పీ ఆధిక్యం

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 10:54 AM
 

భారతీయ జనతా పార్టీ ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉత్తరప్రదేశ్‌ ఉప ఎన్నికల ఫలితాలు నేడు వెలువడుతున్నాయి. గోరఖ్‌పూర్‌ లోక్‌సభ స్థానంలో భాజపా ఆధిక్యంలో ఉండగా, ఫుల్‌పూర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ ఆధిక్యం కొనసాగుతోంది. గతంలో ఈ రెండు స్థానాల్లోనూ భాజపానే విజయం సాధించింది. అధికార భాజపాను ఓడించేందుకు ఎస్పీ, బహుజన్‌ సమాజ్‌ వాదీ పార్టీ ఈ ఎన్నికల కోసం ఒక్కటయ్యాయి. గోరఖ్‌పూర్‌ నియోజకవర్గంలో యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అయిదు సార్లు విజయం సాధించారు. గత ఏడాది యోగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. అలాగే కేశవ్‌‌ ప్రసాద్‌ మౌర్య ఉప ముఖ్యమంత్రి పదవి చేపట్టడంతో ఫుల్‌పూర్‌ నియోజకవర్గం ఖాళీ అయ్యింది. రెండు నియోజకవర్గాల్లోనూ తిరిగి విజయం సాధించాలని యోగి విస్తృతంగా ప్రచారం చేశారు.


బిహార్‌లోని ఒక లోక్‌సభ స్థానానికి, రెండు అసెంబ్లీ స్థానాలకు కూడా ఈరోజు కౌంటింగ్‌ జరుగుతోంది. అరారియా లోక్‌సభ స్థానం, జహానాబాద్‌ అసెంబ్లీ స్థానాల్లో తొలి రౌండ్ల ఫలితాల్లో లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ పార్టీ ఆధిక్యంలో ఉంది. ఈ  రెండు స్థానాల్లో కూడా గత ఎన్నికల్లో ఆర్జేడీనే గెలిచింది. భబువా అసెంబ్లీ స్థానంలో భాజపా ఆధిక్యంలో కొనసాగుతోంది. గత ఏడాది భబువాలో భాజపా ఎమ్మెల్యే మరణించడంతో ఈ స్థానం ఖాళీ అయ్యింది. గత సెప్టెంబరులో బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌.. ఆర్జేడీ, కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకుని భాజపాతో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉప ఎన్నికల ఫలితాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.