కొనసాగుతున్న కోమటిరెడ్డి, సంపత్‌ల నిరసన దీక్ష

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 11:09 AM
 

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సభ్యులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌లు చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. సభ్యత్వం రద్దుకు నిరసనగా గాంధీ భవన్‌లో వెంకట్‌రెడ్డి, సంపత్‌లు నిరసన దీక్ష చేపట్టారు. గజ్వేల్‌లో పర్యటించినందుకే తనపై కేసీఆర్‌ కక్ష పెంచుకున్నారని కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి ఆరోపించారు. ఈరోజిక్కడ ఆయన మాట్లాడుతూ.. ఉప ఎన్నికలు ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. త్వరలోనే రాహుల్‌తో మహబూబ్‌నగర్‌, నల్గొండలో సభలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేల సభ్యత్వం రద్దు చేస్తే మిగిలిన ఎమ్మెల్యేలు సభలో ఉండి ఏం చేస్తారు?.. అందరం రాజీనామాలు చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్తామన్నారు. ఈ రోజు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నామని కాంగ్రెస్‌ నాయకులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సభ్యత్వ రద్దుకు నిరసనగా గాంధీ భవన్‌లో చేపట్టిన నిరసన దీక్ష కొనసాగుతోంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలంతా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రాహుల్‌కు కూడా సమాచారం ఇచ్చామని పేర్కొన్నారు. ఏఐసీసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకుంటుందన్నారు.