ఇంటర్నెట్ స్పీడ్: టాప్ 5లో హైదరాబాద్, విశాఖ

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 12:18 PM
 

దేశంలోనే అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను దక్షిణాది ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు. దేశంలో ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్‌ను వాడుతున్న నగరాల్లో చెన్నై అగ్రస్థానంలో ఉంది. ఇక రాష్ట్రాల్లో కర్ణాటక దేశంలోనే నెంబర్ వన్‌గా అని తేలింది. ఈ మేరకు ఇంటర్నెట్ స్పీడ్‌ను పరీక్షించే ‘ఊక్లా’ సంస్థ తాజాగా ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వేగంపై నివేదికను విడుదల చేసింది. దేశంలో అత్యధిక వేగవంతమైన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్‌ను వాడుతున్న నగరాల్లో హైదరాబాద్‌కు మూడో స్థానం దక్కింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఊక్లా చేసిన సర్వేలో ఈ విషయం తేలింది.


సగటున 32.67 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడుతో చెన్నై దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇక 31.09 ఎంబీపీఎస్ స్పీడుతో బెంగుళూరు రెండో స్థానంలో ఉండగా.. హైదరాబాద్ 28.93 ఎంబీపీఎస్ స్పీడుతో మూడో స్థానంలో నిలిచింది. 26.59 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ స్పీడుతో విశాఖపట్నం నాలుగో స్థానాన్ని సొంతం చేసుకుంది. దేశ రాజధాని ఢిల్లీ 18.16 ఎంబీపీఎస్ స్పీడుతో ఐదో స్థానంలో ఉండటం గమనార్హం. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబై అతితక్కువ ఇంటర్నెట్ స్పీడును (12.07 ఎంబీపీఎస్) కలిగి ఉన్న మెట్రో నగరంగా నిలిచింది. ఈ జాబితాలో ముంబై 8వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ జాబితాలో పాట్నా ఆఖరి స్థానంలో నిలిచింది. అక్కడి బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులకు లభిస్తున్న యావరేజ్ ఇంటర్నెట్ స్పీడ్ 7.80 ఎంబీపీఎస్ మాత్రమే.


ఇక ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ విషయంలో మన దేశం 67వ స్థానంలో ఉంది. దేశ వ్యాప్తంగా సగటు ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 20.72 ఎంబీపీఎస్‌గా ఉంది. ప్రపంచం మొత్తం మీద అత్యధిక వేగవంతమైన ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడును పొందుతున్న దేశంగా సింగపూర్ నిలిచింది. సింగపూర్‌లో సగటు ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ స్పీడ్ 161.53 ఎంబీపీఎస్‌గా ఉంది.