తెలంగాణ నవంబర్‌ వన్‌ విలన్‌ కాంగ్రెస్సే: కేసీఆర్‌

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 02:42 PM
 

1999లోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని సీఎం కేసీఆర్‌ అన్నారు. అసెంబ్లిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాట్లాడుతూ 2001లో కొండా లక్ష్మణ్‌ బాపూజీ గృహం జలదృశ్యం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించామన్నారు. తెలంగాణ నంబర్‌ 1 విలన్‌ కాంగ్రెస్సేనని 18 ఏళ్ల కితం జలదృశ్యంలోనే చెప్పానన్నారు. నాటి నుంచి నిన్నటి వరకు కూడా కాంగ్రెస్‌ వాళ్ల ప్రవర్తన అలాగే ఉందన్నారు. బస్సు యాత్ర అనుమతి కోసం ఢిల్లి నుంచి అనుమతి కావాలా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల మనోభావాలు కాలరాసి, ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణను కలిపిందే జవహర్‌లాల్‌ నెహ్రూ అన్నారు. 1969లో తెలంగాణ పట్ల కాంగ్రెస్‌ విలన్‌ పాత్ర పోషించిందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. నెహ్రూ నిర్ణయానికి నాటి కాంగ్రెస్‌ నేతలు తల ఊపి అంగీకరించారన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి మంత్రి పదవి ఇవ్వగానే చిన్నారెడ్డి ఉద్యమం ఊసెత్తలేదన్నారు. తెలంగాణ తేవడం ఎంత ముఖ్యమో రాజకీయ సుస్థిరత అంత ముఖ్యమని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ కోసం మిగతా పార్టీల సభ్యులను టీఆర్‌ఎస్‌లో కలుపుకున్నామన్నారు. తెలంగాణను కాపాడుకోవడమే కేసీఆర్‌ నీతి అని పేర్కొన్నారు. వంద శాతం నిస్వార్థంగా పని చేస్తున్నామన్నారు, ఇది ప్రజలే చెబుతున్నారని పేర్కొన్నారు. గతంలో సచివాలయంలో పైరవీ ముఠాలు యథేచ్ఛగా ఉండేవారని, ఇప్పుడు చూద్దామంటే పైరవీకారులు ఒక్కరూ కనబడరని సీఎం కేసీఆర్‌ అన్నారు.పరిశ్రమలకు 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. ఎవరైనా నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండాలన్నారు. టెండర్లలో అవినీతి జరిగితే ప్రతిపక్షాలు నిరూపించాలని పేర్కొన్నారు. నిరాధార ఆరోపణలు తప్ప ఒక్క అవినీతి నిరూపించలేదన్నారు. మిషన్‌ కాకతీయ కింద 17వేల చెరువులు బాగుపడ్డాయని, మరో 6, 7వేల చెరువుల మరమ్మతు పనులు జరుగుతున్నాయన్నారు.