ఎల్‌వోయూల‌ను ఆపేసిన ఆర్బీఐ

  Written by : Suryaa Desk Updated: Wed, Mar 14, 2018, 03:08 PM
 

పీఎన్బీ కుంభకోణం అసలుకే ఎసరు తెచ్చింది. వాణిజ్య, పారిశ్రామిక రంగాలు విరివిగా వినియోగించుకునే బ్యాంకు గ్యారంటీ సాధనాలు లెటర్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌, లెటర్‌ ఆఫ్‌ కంఫర్ట్‌ను భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) రద్దు చేసింది. ఇకపై ఈ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను జారీ చేయవద్దని బ్యాంకులను ఆదేశిం చింది. లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌ (ఎల్‌ఒయు)ను ఉపయోగించే వజ్రాల వ్యాపారి నీరవ్‌ మోదీ పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్బీ)ను 13,000 కోట్ల రూపాయల మేర మోసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఎప్పటి నుంచో వాణిజ్య వర్గాలు బ్యాంకుల సర్వీసుల్లో భాగంగా ఉపయోగించుకుంటున్న బ్యాంకు గ్యారంటీలు, లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సౌకర్యాలు మాత్రం యథాతథంగా కొనసాగుతాయి.సాధారణంగా ఎల్‌ఒయుల్లో వ్యాపార సంస్థ మోసానికి పాల్పడితే జారీ చేసిన బ్యాంకు నెత్తిన భారం పడుతుంది. నీరవ్‌ మోదీ విషయంలో మొత్తం నష్టాన్ని పీఎన్బీ భరిస్తున్న విషయం తెలిసిందే. బ్యాంకు గ్యారంటీలు, ఎల్‌ఒసిల విషయంలో కస్టమర్‌ ఆర్థిక పరిస్థితిని బ్యాంకులు ముందుగానే మదింపు వేయడంతో పాటు నష్టం జరగకుండా పూచీలను పకడ్బందీగా తీసుకుంటాయి. ఎల్‌ఒసిలపై దిగుమతుల పూర్తి వివరాలు, జారీ చేసిన తేదీ, ఎక్స్‌పైరీ డేట్‌, ఇతర లావాదేవీల వివరాలు ఉంటాయి. లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సౌకర్యాన్ని వినియోగించుకున్న సంస్థలు బ్యాంకులకు టోపీ వేయడం దాదాపు అసాధ్యం.