-52 వారాల గరిష్ఠానికి రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 66.17
-రూ. 1.31 లక్షల కోట్లు లాభపడ్డ ఇన్వెస్టర్లు
-స్టాక్‌మార్కెట్లకు యూపీలో బీజేపీ కిక్కు
-ఒక్కసారిగా పెరిగిన కొనుగోళ్ల వెల్లువ
మరింత కాలం ర్యాలీ అంచనా వేస్తున్న నిపుణులు
ముంబై: స్టాక్ మార్కెట్లకు నరేంద్ర మోదీ విజయం ఇచ్చిన ఉత్సాహం కొనసాగుతోంది. నేటి సెషన్లో నిఫ్టీ 50 సూచిక ఆల్ టైం రికార్డును తాకింది. ఓ దశలో 9,122.75 పాయింట్లను తాకిన నిఫ్టీ మధ్యాహ్నం 1:15 గంటల సమయంలో 9,078 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ సూచికకు 52 వారాల గరిష్ఠస్థాయి 8,992 పాయింట్లు కాగా, కనిష్ఠస్థాయి 7,516 పాయింట్లు. కాగా, సమీప భవిష్యత్తులో ఈ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఈ సెషన్ లో రియల్టీ సెక్టారు అత్యధికంగా 2.32 శాతం లాభాల్లో నడుస్తుండగా, ప్రైవేటు బ్యాంకులు సగటున 2.25 శాతం, ఫైనాన్షియల్ సేవల సంస్థలు 2.24 శాతం, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్‌స 2 శాతం లాభాల్లో సాగుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, లార్సెన్ అండ్ టూబ్రో, అల్ట్రా సిమెంట్‌స, ఏషియన్ పెయింట్‌స, యస్ బ్యాంక్, అదానీ పోర్ట్స, హెచ్డీఎఫ్సీ, గ్రాసిమ్, బీహెచ్‌ఈఎల్, బీపీసీఎల్ తదితర కంపెనీలు 2.50 శాతం నుంచి 5.90 శాతం మేరకు లాభాలను సాధించాయి. భారతీ ఎయిర్ టెల్, గెయిల్, సన్ ఫార్మా, ఐడియా, కోల్ ఇండియా సంస్థలు ఒక శాతం వరకూ నష్టాల్లో కొనసాగుతున్నాయి
.ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఘన విజయం ప్రభావం నేడు స్టాక్ మార్కెట్ తో పాటు ఫారెక్‌స మార్కెట్ పైనా కనిపించింది. రూపాయికి ఒక్కసారిగా విలువ పెరిగింది. డాలర్ తో పోలిస్తే, ఏకంగా 43 పైసలు లాభపడింది. శుక్రవారం నాటి ముగింపు రూ. 66.60తో పోలిస్తే, ఈ ఉదయం రూ. 66.17 వద్ద ట్రేడ్ అయింది. డాలర్ తో రూపాయి మారకపు విలువ ఈ స్థాయికి పెరగడం గత ఏడాది వ్యవధిలో ఇదే తొలిసారి. నోట్ల రద్దు తరువాత మార్కెట్ వర్గాల్లో ఉన్న అనిశ్చితికి మోదీ ఈ ఎన్నికల ఫలితాలతో తెరదించారని బ్రోకరేజ్ సంస్థ మెక్వయిర్ అభిప్రాయపడింది. దీర్ఘకాలం పాటు సుస్థిరమైన ప్రభుత్వం ఉంటుందన్న సంకేతాలతో ఇన్వెస్టర్లు పెట్టుబడులతో వచ్చారని చెప్పారు.
కాగా, నేటి స్టాక్ మార్కెట్ తన లాభాలను మరింతగా పెంచుకుంది. ఉదయం 11:10 గంటల సమయంలో సెన్సెక్‌స 500 పాయింట్లకు పైగా పెరిగి 29,450 పాయింట్లకు చేరింది. లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ. 1.31 లక్షల కోట్లకు పైగా పెరిగి రూ. 1,18,70,631 కోట్ల వద్ద కొనసాగుతోంది. ఇకపై నిఫ్టీ కొత్త రేంజ్ ని ఏర్పాటు చేసుకున్నట్టుగా భావించవచ్చని, 9,100 నుంచి 9,500 మధ్య నిఫ్టీ కదలికలు ఉంటాయని భావిస్తున్నామని హెచ్‌ఆర్బీవీ క్లయింట్ సొల్యూషన్‌స ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టీఎస్ హరిహర్ అంచనా వేశారు. సమీప భవిష్యత్తులో 9,100 పాయింట్ల వద్ద ఉన్న సాంకేతిక నిరోధాన్ని నిఫ్టీ అధిగమిస్తే, 10,350 వరకూ వెళ్లవచ్చని బ్రోకరేజ్ సంస్థ సీఎల్‌ఎస్‌ఏ పేర్కొంది.
స్టాక్‌మార్కెట్లు మంగళవారం ఉదయం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ దాదాపు 157 పాయింట్లు పెరిగి 9091వద్ద ప్రారంభమైంది. ఒకానొక దశలో అత్యధికంగా 9122 మార్కును తాకింది. ఇక సెన్సెక్‌స 491 పాయింట్లు పెరిగి 29437 వద్ద ప్రారంభమై 29561మార్కును చేరింది. లోహరంగంలో షేర్లు తప్పితే మిగిలిన అన్ని రంగాల్లో షేర్లు లాభాల్లో దూసుకెళుతున్నాయి. మధ్యాహ్న సమయానికి నిఫ్టీ 9069 వద్ద సెన్సెక్‌స 29387 వద్ద ట్రేడవుతోంది.
ఇంత దూకుడు దేనికి: ఉత్తరప్రదేశ్‌లో భాజపా అఖండ విజయం సాధించడం మార్కెట్లలో జోష్ నింపుతుందని నిపుణులు భావించారు. అనుకున్నట్లే నేటి ఉదయం మార్కెట్లు రికార్డు స్థాయిని అందుకున్నాయి. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ అనిశ్చితి ఉత్తరప్రదేశ్ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా మాయమైంది. సాధారణంగా ప్రభుత్వ నిర్ణయాలను రాజకీయాలు ప్రభావితం చేస్తాయి. ఇది మార్కెట్లపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుత విజయంతో కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి రాజ్యసభలో కూడా పరిస్థితి మెరుగుపడుతుంది. దీంతో ఇప్పటివరకు కదలిక లేని కీలక సంస్కరణలను ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వానికి తేలికవుతుంది. మోదీ పాలసీ వ్యతిరేకులు కొన్నాళ్లు మౌనాన్ని ఆశ్రయించేందుకు ఈ విజయం కారణమవుతుంది. 2019 ఎన్నికలకు దీనిని సెమీ ఫైనల్‌గా భావిస్తారు. దీనిలో విజయంతో వచ్చే సాధారణ ఎన్నికల్లో భాజపా పరిస్థితిని చెప్పకనే చెప్పాయి. దీంతో సంస్కరణల రథానికి ఎదురుండదని మార్కెట్ భావిస్తోంది. దీనికి తోడు డీమానిటెజేషన్ తర్వాత ఆంక్షలను ఆర్‌బీఐ పూర్తిగా తొలగించడంతో కూడా మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. ఆర్థిక వ్యవస్థలోకి తగినంత ధనం రావడంతో కొనుగోళ్లు పెరిగుతాయని భావిస్తున్నారు.