ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడిన భారత వికెట్‌ కీపర్‌

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 19, 2018, 11:40 AM

ఇది అలాంటి ఇలాంటి ఉత్కంఠ కాదు. తనువును ఉన్నచోటే బంధించింది. కళ్లను రెప్పలు కొట్టకుండా కట్టేసింది. గుండె దడను అమాంతం పెంచేసింది. నిజం... ఆ ఉత్కంఠకు నరాలు కాదు ఉక్కు తీగలే తెగుతాయేమో?భారత్‌ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్‌ లేడు. కేవలం జిడ్డుగా, పరుగులకు అడ్డుగా ఉన్న విజయ్‌ శంకరే ఉన్నాడు. దినేశ్‌ కార్తీక్‌ అప్పుడే వచ్చాడు. అది 19వ ఓవర్‌! ఇక గెలుపు ఆశలే లేవు. టి20ల్లో ఏనాడూ బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిపోని భారత్‌... ఇపుడు ఏకంగా కప్‌నే కోల్పోవాల్సిన పరిస్థితి. కానీ దినేశ్‌ దడదడలాడించాడు. రూబెల్‌ హొస్సేన్‌ వేసిన ఆ ఓవర్లో జూలు విదిల్చాడు. 6, 4, 6, 0, 2, 4 అంతే! భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులైంది. సౌమ్య సర్కార్‌ చేతిలో బంతి. ఇక ఈజీలే అనుకుంటే విజయ్‌ శంకర్‌ బంతులు మింగే పనిలో ఉన్నాడు. తొలి బంతికి వైడ్‌తో పరుగొచ్చింది. 0, 1, 1, ఎట్టకేలకు 4వ బంతికి ఫోర్‌ కొట్టి ఐదో బంతికి ఔటయ్యాడు. ఇక మిగిలింది ఒక్కటే బంతి! గెలిచేందుకు 5 పరుగులు.క్రీజులో దినేశ్‌ కార్తీక్‌... ఉత్కంఠ ఎవరెస్టంతా. అందరిలోనూ టెన్షన్‌... టెన్షన్‌... కార్తీక్‌ ఒక్కడే అటెన్షన్‌. సౌమ్య సర్కార్‌ బంతి వేశాడు. అందరూ కళ్లప్పగించి చూస్తుండగా కార్తీక్‌ బ్యాట్‌ నుంచి ఎక్స్‌ట్రా కవర్స్‌ మీదుగా ఫ్లాట్‌ షాట్‌. ఫోరేమోననే బెంగ... కానీ అది సిక్సర్‌. భారతే విన్నర్‌.


టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. ఇన్నింగ్స్‌ నాలుగో ఓవర్లో జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ (11; 1 సిక్స్‌)ను సుందర్‌ ఔట్‌ చేయగా, ఆ మరుసటి ఓవర్లోనే చహల్‌ దెబ్బమీద దెబ్బ తీశాడు. మరో ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ (15; 1 ఫోర్‌)తో పాటు సౌమ్య సర్కార్‌ (1)నూ పెవిలియన్‌ చేర్చాడు. తమీమ్‌ భారీ సిక్సర్‌కు ప్రయత్నించగా, లాంగాన్‌లో ఫీల్డర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ బౌండరీ లైన్‌ వద్ద తనను తాను నియంత్రించుకుంటూ అద్భుతమైన క్యాచ్‌ పట్టాడు. దీంతో 27 పరుగుల వద్దే బంగ్లా రెండో వికెట్‌ కోల్పోయింది. తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్‌ స్వీప్‌షాట్‌ ఆడగా... స్క్వేర్‌ లెగ్‌లో శిఖర్‌ ధావన్‌ క్యాచ్‌ అందుకున్నాడు. 33 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన బంగ్లాను షబ్బీర్‌ రహమాన్, ముష్ఫికర్‌ రహీమ్‌ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ చహల్‌ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. గూగ్లీతో ముష్ఫికర్‌ (9) ఆట కట్టించాడు. అతని క్యాచ్‌ను విజయ్‌ శంకర్‌ డైవ్‌ చేసి పట్టడంతో బంగ్లా 68 పరుగుల వద్ద నాలుగో వికెట్‌ కోల్పోయింది.  


తడబడింది... 


లక్ష్యఛేదనకు దిగిన భారత ఇన్నింగ్స్‌ ధాటిగా ప్రారంభమైంది. రెండో ఓవర్లో కెప్టెన్‌ రోహిత్‌ రెండు సిక్సర్లు, ఒక ఫోర్‌ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లలోనే 24 పరుగులు చేయగా... ఆ తర్వాతి వరుస ఓవర్లలో ధావన్‌ (10), రైనా (0)లు నిష్క్రమించడంతో భారత్‌ ఇన్నింగ్స్‌ తడబడింది. ఈ దశలో రోహిత్‌ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ముందుగా రాహుల్‌తో కలిసి రన్‌రేట్‌ తగ్గకుండా లక్ష్యం దిశగా నడిపించాడు. బ్యాట్‌కు అందిన బంతిని భారీ సిక్సర్లుగా, అదుపు తప్పిన బంతిని బౌండరీగా మలుస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 51 పరుగులు జోడించాక జట్టు స్కోరు 83 పరుగుల వద్ద రాహుల్‌... రూబెల్‌ హొస్సేన్‌ బౌలింగ్‌లో షబ్బీర్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో మనీశ్‌ పాండే క్రీజ్‌లోకి రాగా... రోహిత్‌ 35 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.  అంతర్జాతీయ టి20ల్లో అతనికిది 14వ అర్ధ సెంచరీకాగా కొద్దిసేపటికే నాలుగో వికెట్‌గా నిష్క్రమించాడు. నజ్ముల్‌ ఇస్లామ్‌ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్‌ మహ్ముదుల్లా క్యాచ్‌ పట్టడంతో పెవిలియన్‌ చేరాడు.  


బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోషన్‌గా వచ్చిన విజయ్‌ శంకర్‌ భారత ఇన్నింగ్స్‌కు గుదిబండగా మారాడు. పాండే (27 బంతు ల్లో 28; 3 ఫోర్లు) వేగంగా పరుగులు చేస్తుంటే... మరోవైపు విజయ్‌ (19 బంతుల్లో 17; 3 ఫోర్లు) అదేపనిగా బంతుల్ని వృథా చేశాడు. దీంతో సమీకరణం మారింది. 15 ఓవర్లు ముగిసే సరికి 30 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా, 18 బంతుల్లో 35కు పెరిగింది. 18వ ఓవర్‌ వేసిన ముస్తఫిజుర్‌ కేవలం పరుగు మాత్రమే ఇచ్చి పాండే వికెట్‌ తీశాడు. ఇక భారత్‌ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు చేయాలి. ఈ దశలో వచ్చిన దినేశ్‌ కార్తీక్‌ అసాధారణ ఆటతీరుతో భారత్‌ను గెలిపించాడు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa