ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈత నేర్పడం ఉత్తమం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 21, 2018, 11:51 AM

కన్నారం.. గుడితండా.. వట్టినాగులపల్లి.. అన్ని ఊర్లదీ ఒకటే గుండెకోత. అందరిదీ ఒకటే బాధ. ఈతకు వెళ్లిన పిల్లలు విగతజీవులయ్యారు. అది చూసి తట్టుకోలేక అమ్మానాన్నలు గుండెలు బాదుకున్నారు. ఊరుఊరంతా కన్నీరయ్యింది. ఆ వార్తలను చదివినవారి హృదయాలు బరువెక్కాయి. కేవలం మూడు రోజుల్లో 15మంది చిన్నారులు జలసమాధయ్యారు. వీరిలో ఎక్కువమంది పది పన్నేండ్ల వయస్సు పిల్లలే. అంతలోనే ఆయుష్షు తీరిపోయింది. నూరేండ్ల జీవితం బాల్యం గడువకముందే ముగిసిపోయింది. ఎందుకీ అనర్థం? ఎందుకీ కడుపుకోత? ఇలాంటి విషాదాలను నివారించే మార్గం లేదా? పిల్లలను కాపాడుకొనే ఉపాయమే లేదా? చెరువులోకి దిగి, ఈత కొట్టాలని బడిఈడు పిల్లలు ముచ్చటపడడంలో తప్పులేదు. అదేమీ ప్రమాదమూ కాదు. ఈత సరదా మాత్రమే కాదు మంచి వ్యాయామం. కాకపోతే, సరైన శిక్షణ, పెద్దల పర్యవేక్షణలేకుండా.. తాము దిగుతున్న జలాశయాల లోతులు, ఎత్తు పల్లాలు తెలియకుండా.. వాటి మీద అవగాహనలేకుండా ఈత కొట్టడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయి. చిన్నారుల ప్రాణాలు పోతున్నాయి. నిజానికి ఈతంటే భయపడాల్సిన పనిలేదు. ఈత నేర్చుకోవాలన్న ఉత్సాహం ఉన్న పిల్లలకు నేర్పించాలి. పెద్దలే దగ్గరుండి పర్యవేక్షించాలి. చెరువులు, కుంటలు, కాల్వల్లో పొంచివుండే ప్రమాదాల గురించి అవగాహన కల్పించాలి. ఎక్కడ ఈత కొట్టవచ్చో, ఎక్కడ సాహసాలకు పూనుకోకూడదో విడమరిచి చెప్పాలి. అప్పుడు అనర్థాలకు తావుండదు. 


ఇటీవల జరిగిన కొన్ని ప్రమాదాలు


-ఈ నెల 19న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం బొమ్మనపల్లిలో ఒంటిపూట బడి ముగిసిన తర్వాత ఈతకు వెళ్లిన నలుగురు చిన్నారులు మృతిచెందారు. లావుడ్యా రత్న కుమారుడు సౌజన్, భూక్య నగేశ్ కుమారుడు సిద్ధు, బానోత్ శంకర్ కుమారుడు సంతోష్, బానోతు రత్న కుమారుడు దిలీప్ చనిపోయారు. వీరంతా పది నుంచి పదమూడు ఏండ్ల వయస్సున్న పిల్లలు. ఈత రాకుండానే చెరువులోకి దిగడంతో మృత్యుకబలించింది. 


-ఈ నెల 18న మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన ఖాజా ఇంతియాజ్ అలీ, అతని బావమరిది మహ్మద్ ఆసీన్, ఇంతియాజ్ కుమారుడు ఇసాక్‌అలీ, అహ్మద్‌అలీ, మరదలి కుమార్తె హుదాకరీన కన్నారం పెద్ద చెరువులో మునిగి చనిపోయారు. సరాదాగా స్నానం చేసేందుకు నీటిలో దిగి మునిగిపోతున్న చిన్నారులను కాపాడే ప్రయత్నంలో ఇంతియాజ్ అలీ, అతని బావమరిది ఆసీన్ సైతం చనిపోయారు. 


-ఈ నెల 18న నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకల పంచాయతీ పరిధి గుడితండా పెండ్లిపాకల రిజర్వాయర్‌లో ఈతకు వెళ్లి ఐదుగురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. వీరంతా గుడితండాకు చెందిన అన్నదమ్ములు. నేనావత్ సర్దార్, నేనావత్ హన్మ, నేనావత్ ఓంకార్ కుమారులు. అంతా ఐదు నుంచి ఆరేండ్ల చిన్నారులు. 


-ఈ నెల 17న హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నలగండ్లలో నివస్తిన్న శ్రీనివాస్, స్వాతి దంపతుల కుమారుడు దినేశ్(5) వట్టినాగులపల్లి శ్రీదేవి ఇంజినీరింగ్ కళాశాలకు తల్లితోపాటు వెళ్లి.. పక్కనే ఉన్న గెస్ట్‌హౌస్‌లో స్విమ్మింగ్‌పూల్‌లో ప్రమాదవశాత్తుపడి మృతి చెందాడు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa