ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కీలకంగా మారుతున్న మమత..విందులు వ్యూహాలకేనా?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 28, 2018, 01:14 PM

ప్రధాని నరేంద్ర మోడీ అంటే ఒంటి కాలు మీద లేచే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తుంది. మోడీ వ్యతిరేక కూటమి కోసం పావులు కదుపుతున్నారు. వివరాల్లోకి వెళితే ప్రధాని నరేంద్ర మోడీ సహా బిజెపి ప్రభుత్వాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్న మమత కేంద్ర ప్రభుత్వ విధానాలపై అవకాశం చిక్కిన ప్రతిసారి మండిపడుతున్నారు. 


గతేడాది జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా ఆమె ఎన్డియేకి మద్దతు ఇవ్వలేదు. చంద్రబాబు వంటి నేతలు సంప్రదింపులు జరిపినా ఆమె ససేమీరా అన్నారు. నోట్ల రద్దు నుంచి మోడిపై ఆగ్రహంగా ఉన్న మమత..ఎన్డియే నుంచి తెలుగుదేశం పార్టీ బిజెపిని వ్యతిరేకించి బయటకు రావడంతో ఆమె మోడీ వ్యతిరేక కూటమికి శ్రీకారం చుట్టారు. ఈ నేపధ్యంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ కూడా కీలక ప్రకటన చెయ్యడంతో ఆమె కెసిఆర్ తో సమావేశం కూడా అయ్యారు. అయితే కెసిఆర్ కాంగ్రెస్ - బిజెపి వ్యతిరేక కూటమి అనడం..మమత మోడీ వ్యతిరేక కూటమి అనడంతో అప్పటి నుంచి కెసిఆర్ ప్రకటన మరుగున పడిపోగా మమత మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. 


ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అవిశ్వాసానికి స్వచ్చందంగా మద్దతు పలికిన మమత టిడిపి అవిశ్వాసం చర్చకురాకపోయినా ఆమె వెనుకడుగు వేయలేదు. ఆ వెంటనే కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస నోటీసు ఇవ్వడంతో చర్చకు తప్పక వచ్చే పరిస్థితి ఏర్పడింది. దీనితో ఆమె ఢిల్లీ వెళ్ళారు. సోమవారం ఢిల్లీ వెళ్ళిన ఆమె అక్కడి జాతీయ స్థాయి నేతలతో కీలక సమావేశాలు నిర్వహించే దిశగా అడుగులువేస్తున్నారు. 


మంగళవారం ఆమె యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలు విపక్ష పార్టీల నేతలను, ఎంపీలను కలుసుకోనున్నారు. బుధవారం ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఏర్పాటు చేసిన విందులోనూ పాల్గొననున్నారు. 2019 ఎన్నికల నాటికి బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసేందుకు ఆమె వీరితో చర్చించే అవకాశం ఉంది.


అలాగే మంగళవారం చర్చకు వచ్చే అవిశ్వాస తీర్మానం విషయంలో కూడా ఆమె కేంద్రాన్ని ఇరుకున పెట్టడానికి గాను ఎస్పి , బిఎస్పి లాంటి కీలక పార్టీలను కూడా ఒకే తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి బిజెపిని దెబ్బకొట్టిన నేపధ్యంలో ఆమెకు మరింత అనుకూలంగా మారే అవకాశం లేకపోలేదు. కాగా త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబుతో కూడా సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa