ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జీశాట్-11 శాటిలైట్‌ను వెనక్కి రప్పించిన ఇస్రో

Telangana Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 25, 2018, 03:33 PM

బెంగుళూరు: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వెనుకడుగు వేసింది. ప్రయోగానికి సిద్ధమైన జీశాట్-11 ఉపగ్రహాన్ని వెనక్కి రప్పించింది. వాస్తవానికి ఈ ఉపగ్రహాన్ని దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్ గయానాలో ఉన్న కౌరు అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించాల్సి ఉంది. మే 25వ తేదీన జరగాల్సిన ప్రయోగాన్ని రద్దు చేస్తున్నట్లు ఏరియన్ సంస్థ వెల్లడించింది. ఏరియన 5 రాకెట్ ద్వారా జీశాట్-11ను ప్రయోగించాలనుకున్నారు. దాని కోసం మార్చి 28వ తేదీనే జీశాట్ ఉపగ్రహాం కౌరుకు చేరుకున్నది. కానీ ఇస్రో అకస్మాత్తుగా ప్రయోగాన్ని నిలిపివేసింది. జీశాట్-11కు అదనపు సాంకేతిక పరీక్షలు నిర్వహించాల్సి ఉందని ఇస్రో వెల్లడిస్తోంది. జీశాట్-11 మొత్తం 5870 కిలోల బరువు ఉంది. 12జీబీపీఎస్ కెపాసిటీకి తగ్గట్లుగా దీన్ని డిజైన్ చేశారు. ఇస్రో ఎందుకు జీశాట్ ప్రయోగాన్ని నిలిపేసిందన్న దానిపై స్పష్టత లేదని ఏరియన్ సంస్థ పేర్కొన్నది. కానీ ఇస్రోకు సహకరిస్తామని ఆ సంస్థ తెలిపింది. అయితే మార్చి 29న ప్రయోగంచిన జీశాట్-6 ఆచూకీ ఇంకా చిక్కలేదు. ఆ టెలికాం శాటిలైట్ గగనతలంలో మిస్సైన విషయం తెలిసిందే. జీశాట్-11 ద్వారా కా, కూ బ్యాండ్‌లలో స్పాట్ బీమ్ కవరేజ్ ఇవ్వనున్నారు. భారత్‌తో పాటు సమీప దీవులకు ఈ సేవలు అందనున్నాయి. జీశాట్11 ప్రయోగం కోసం భారత్ సుమారు 1117 కోట్లు ఖర్చు చేసింది. మార్చి 2016లో కేంద్ర క్యాబినెట్ ఈ ప్రయోగానికి పచ్చ జెండా ఊపింది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com