ఎన్నో అద్భుత ఫీట్లకు వేదికవుతోంది ప్రస్తుతం జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్. వైవిధ్యమైన షాట్లతో బ్యాట్స్మన్లు బెంబేలెత్తిస్తోంటే.. అంతే తెలివైన, పదునైన బంతులతో బౌలర్లు సత్తా చాటుతున్నారు. అంతేనా.. ఫీల్డ్‌లో మెరుపు వేగంతో కదులుతూ, పక్షుల్లా ఎగురుతూ ఫీల్డర్లు ఎన్నో అద్భుత ఫీట్లతో అభిమానులను అలరిస్తున్నారు.
అలాంటి ఓ అద్భుతమైన ఫీటే గురువారం జరిగిన సన్‌రైజర్స్-రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్‌లో జరిగింది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్ల ఫీల్డర్లు(కోహ్లీ కూడా రెండు క్యాచ్‌లు) ఎన్నో సులభమైన క్యాచ్‌లను జారవిడిచారు. అయితే డివిల్లీర్స్ పట్టిన ఓ క్యాచ్ మ్యాచ్ మొత్తానికే.. కాదు కాదు.. ఐపీఎల్ చరిత్రలోనే అత్యుత్తమ క్యాచ్‌ల్లో ఒకటిగా నిలిచింది. దీనిపై బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విట్టర్ వేదికగా స్పందించాడు.
డివిల్లీర్స్ అందుకున్న క్యాచ్ ఫొటోను పోస్ట్ చేసిన కోహ్లీ ‘‘ఈరోజు ‘స్పైడర్‌మ్యాన్’ను ప్రత్యక్షంగా చూశా’’ అని ట్వీట్ చేశాడు. దీనిని క్రికెట్ అభిమానులు తెగ షేర్లు చేస్తున్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్లో ఈ ఫీట్ నమోదయింది. మొయిన్ అలీ వేసిన ఆ ఓవర్ చివరి బంతిని ఆడిన అలెక్స్ హేల్స్.. మిడ్ ఆన్ వైపు భారీ షాట్ ఆడాడు. మెరుపు వేగంతో బౌండరీ వైపు దూసుకెళ్లిన బంతిని.. అంతే వేగంతో గాల్లోకి లేచిన డివిల్లీర్స్ ఒక్క చేతితో అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో బెంగళూరు, హైదరాబాద్‌పై 14 పరుగులు తీడాతో విజయం సాధించింది.