ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రేపు బలాన్ని నిరూపించుకోండి : సుప్రీంకోర్టు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, May 18, 2018, 01:05 PM

 కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శుక్రవారం కాంగ్రెస్‌-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్‌ ఏకే సిక్రి, జస్టిస్‌ భూషణ్‌, జస్టిస్‌ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల తరఫు న్యాయవాది తమకు 116 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని ధర్మాసనానికి తెలుపగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి తమకూ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఆర్‌ బొమ్మై కేసును, సర్కారియా కమిషన్‌ సూచనలను సైతం ప్రస్తావించారు. కాంగ్రెస్‌-జేడీఎస్‌ల కూటమి అపవిత్రమైనదని వాదించారు. ఇందుకు ప్రతిగా స్పందించిన అభిషేక్‌ సింఘ్వీ ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలో? ఏ పార్టీ చేపట్టకూడదో? సుప్రీం కోర్టు నిర్ణయించాలని కోరారు. సర్కారియా కమిషన్‌ సూచనలకు న్యాయబద్దత లేదని పేర్కొన్నారు.


ప్రభుత్వ ఏర్పాటును గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాసిన లేఖలను ధర్మాసనం పరిశీలించింది. ఎంతమంది మద్దతు ఉందో వారి వివరాలను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. పూర్తిగా నంబర్‌ గేమ్‌పై కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉందని వ్యాఖ్యానించింది. శనివారం బలపరీక్ష నిర్వహిస్తే బావుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కాంగ్రెస్‌ తరఫు న్యాయవాది సింఘ్వీ సంసిద్ధత వ్యక్తం చేయగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అంత సమయం ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దారి తీసే అవకాశం ఉందని రోహత్గి అభ్యర్థనపై  ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనివల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది.


శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగాలని తీర్పు నిచ్చింది. సీక్రెట్‌ బ్యాలెట్‌ పద్దతిలో ఓటింగ్‌ నిర్వహించాలన్న ప్రతిపాదనను సైతం తిరస్కరించింది. ఎమ్మెల్యేలు అందరికీ రక్షణ కల్పించాలిని, బల పరీక్ష సజావుగా సాగాలని కర్ణాటక డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రొటెం స్పీకర్‌ అధ్యక్షతన బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు కాంగ్రెస్‌-జేడీఎస్‌ల తరఫు న్యాయవాది అభిషేక్‌ మను సింఘ్వీ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ ​ జరుగుతుందని చెప్పారు. బల పరీక్ష అయ్యేంత వరకూ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు చెప్పారు. అయితే, బల పరీక్షను వీడియో షూట్‌ చేయాలన్న కాంగ్రెస్‌ అభ్యర్థనను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించినట్లు వెల్లడించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com