ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్‌బీఐ నష్టం రూ. 7,718కోట్లు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, May 22, 2018, 03:35 PM

 ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాను మొండి బకాయిలు వేధిస్తున్నాయి. నిరర్థక ఆస్తులు పేరుకుపోతుండటంతో జనవరి-మార్చి త్రైమాసికంలో బ్యాంకు అంచనాలకు మించి భారీ నష్టాలను నమోదు చేసింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మార్చితో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు రూ.7,718కోట్ల నికర నష్టాన్ని చవిచూసింది. అంతకు ముందు డిసెంబరు త్రైమాసికంలో రూ. 2,416.37కోట్ల నికర నష్టాన్ని చవిచూడగా.. మార్చి త్రైమాసికంలో నష్టం మరింత పెరిగింది. కాగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎస్‌బీఐ రూ. 2,814.82కోట్ల నికర లాభాన్ని నమోదు చేయడం గమనార్హం.


ఈ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం మాత్రం రూ.68,436.06కోట్లకు పెరిగింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఆదాయం రూ.57,720.07కోట్లుగా ఉంది. ఇక ఈ త్రైమాసికంలో బ్యాంకు ప్రొవిజన్లు రూ.28,096కోట్లకు పెరిగాయి. అంతక్రితం ఏడాది మార్చి త్రైమాసికంలో ఇవి రూ.11,740కోట్లుగా ఉన్నాయి. బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు 10.91శాతానికి పెరిగాయి. అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంలో ఇవి 10.35శాతం ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 9.1శాతంగా ఉన్నాయి.


సమీక్షిస్తున్న త్రైమాసికంలో బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు 5.73శాతానికి పెరిగాయి. డిసెంబరు త్రైమాసికంలో ఇవి 5.61శాతంగా ఉండగా.. 2016-17 ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో 5.19శాతంగా ఉన్నాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com