మెట్రో ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు చేపడుతున్న ఫస్ట్ అండ్ లాస్ట్‌మైల్ కనెక్టివిటీకీ సంబంధించి పూర్తిస్థాయి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యక్తిగత వాహనాలను తగ్గించి కాలుష్యంతోపాటు ట్రాఫిక్ రద్దీని సాధ్యమైనంత తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ విధానానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించి ప్రయాణికుడిని స్టేషన్లకు తీసుకువచ్చి గమ్యస్థానానికి చేర్చడంలో ముఖ్యభూమిక పోషించే చర్యల్లో భాగంగా మెట్రోస్టేషన్లన్నింటిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటిదశలో భాగంగా నాగోల్ నుంచి మియాపూర్ వరకు జరుగుతున్న 30 కిలోమీటర్ల కమర్షియల్ ఆపరేషన్స్‌లో భాగంగా ఈ మార్గంలో ఉన్న 24 స్టేషన్లలో వీటికి సంబంధించిన సూచికలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులు రైలు దిగిన తర్వాత లేదా మెట్రో ఎక్కేందుకు వచ్చిన వాహనం ఎక్కడ దించాలో, ఎక్కడ ప్రయాణికుడిని ఎక్కించుకోవాలనే దానిపై సూచికలను ప్రతీ స్టేషన్లో ఏర్పాటు చేశారు. ఇందులో ట్యాక్సీ పికప్ అండ్ డ్రాప్‌పాయింట్లు, బస్‌బేలు, సైకిల్, మొబీబైక్స్ వంటి వాహనాలు ప్రయాణికులను ఎక్కడ ఎక్కించుకోవాలి..? ఎక్కడ దించేయాలి ? వంటి వాటిని ఎలాంటి అయోమయానికి తావులేకుండా ఏర్పాటు చేశారు.
పికప్ అండ్ డ్రాప్ పాయింట్లు : ప్రస్తుతం ప్రారంభమైన నాగోల్ నుంచి మియాపూర్ మార్గంతోపాటు త్వరలో ప్రారంభమయ్యే ఎల్బీనగర్ మార్గంలోని స్టేషన్లలో కూడా ఉబెర్ పికప్ అండ్ ట్రాప్పాయింట్లను ఫుట్‌పాత్‌ల పక్కన ఏర్పాటు చేశారు. రైడ్‌షేర్ పికప్‌తోపాటు పిలిస్తే క్షణాల్లో అందుబాటులో ఉండేలా ఉబెర్ టోల్‌ఫ్రీ నెంబర్ 9535295352ను కూడా ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చింది. ఫోన్‌చేసి స్టాప్ నెంబరు చెబితే చాలు సంబంధిత స్టేషన్‌కు వచ్చి ట్యాక్సీ ఆగుతుంది. ఉదాహరణకు తార్నాక స్టేషన్లో నిలిచి ఉబెర్ ట్యాక్సీ సేవలు పొందాలంటే తార్నాక స్టాప్ నెంబరు 4322 చెబితే చాలు ట్యాక్సీ పికప్ పాయింట్‌కు వస్తుంది. మెట్టుగూడలో నిల్చున్న ప్రయాణికుడు ట్యాక్సీకీ కాల్ చేయాలంటే స్టాప్ నెంబరు 4334 చెప్పాల్సి ఉంటుంది. ఇలా ప్రతీ స్టేషన్ల వారీగా నెంబర్లను కేటాయించారు. స్టేషన్‌కు ఇరువైపులా ఏర్పాట్లు ఉంటాయి. ఇక ఆర్టీసీ బస్సుల విషయానికి వస్తే స్టేషన్ల సమీపంలోనే బస్‌బేలను ఏర్పాటు చేశారు. ఇలా లాస్ట్‌మైల్ కనెక్టివిటీకీ ప్రాధాన్యత ఇచ్చారు.