ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పన్నీర్‌కు సీఎం, పళనికి ేకంద్ర మంత్రి పదవి చక్రం తిప్పిన బీజేపీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2017, 01:10 AM

చెనై్న : తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. ఆ రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు ఆత్రుతగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటోంది. శశికళ, దినకరన్‌లకు చెక్‌ పెట్టేందుకు తన వంతు సహకారం అందించిన బీజేపీ ఇప్పుడు అన్నా డీఎంకేతో సన్నిహిత సంబంధాలను పెంచుకునే పనిలో పడింది. పన్నీర్‌ సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య చెలిమి కుదర్చడంలో బీజేపీ వేసిన స్కెచ్‌ దాదాపు ఫలప్రదమైందని తెలుస్తోంది. జయలలితకు నమ్మినబంటుగా పేరు గాంచిన పన్నీర్‌ సెల్వంను ముఖ్యమంత్రిగా చేసి, ప్రస్తుత సీఎం పళనిస్వామికి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించేలా ఇరువురు నేతలను బీజేపీ పెద్దలు ఒప్పించగలిగారు. దీంతో, ఓపీఎస్‌, ఈపీఎస్‌ మధ్య సయోధ్య కుదిర్చినట్టు అవుతుంది. అంతే కాదు, బీజేపీ కూటమిలో అన్నా డీఎంకే అధికారికంగా భాగస్వామి అయినట్టు అవుతుంది. దీంతో, రాష్టప్రతి ఎన్నికల సమయంలో బీజేపీకి బలం మరింత పెరుగుతుంది.


 అన్నా డీఎంకే నుంచి బహిష్కరణకు గురైన మాజీ ప్రధాన కార్యదర్శి శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలన్న నిర్ణయంపై శశికళ తమ్ముడు దివాకరన్‌ కుమారుడు జయానంద్‌ ఫేస్‌బుక్‌లో స్పందించారు. పార్టీలో శశికళతో పాటు ఆమె కుటుంబం మొత్తాన్ని దూరంగా ఉంచాలన్న మంత్రుల నిర్ణయం తెలివైనదని ఆయన కొనియాడారు. ఈ విషయాన్ని తాము కొన్ని నెలల క్రితమే చెప్పామని ఆయన తెలిపారు. అప్పుడు ఎవరూ పట్టించుకోలేదని ఆయన అన్నారు. అయితే, ఆలస్యంగా తీసుకున్నా గొప్ప నిర్ణయం తీసుకున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికల నేపథ్యంలో చోటు చేసుకున్న పరిణామాలతో పార్టీ ప్రతిష్ఠ మసకబారి, ప్రజల్లో ఆదరణ కోల్పోవడంతో మేల్కొన్న నేతలంతా ఏకమై శశికళ, దినకరన్‌ లను బహిష్కరించిన సంగతి తెలిసిందే. ఇకపై పార్టీలో వారికి ఎలాంటి ప్రాతి నిధ్యం ఉండకూడదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.


తమిళనాడు రాజకీయాలు రాజ్‌ భవన్‌కు చేరాయి. గత రెండు రోజులుగా తీవ్ర మలుపులు తిరిగిన తమిళనాడు అన్నా డీఎంకే రాజకీయాలు రాష్ట్ర గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగరరావు వద్దకు చేరాయి. గవర్నర్‌ విద్యాసా గరరావును ఎడప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన లోక్‌ సభ డిప్యూటీ స్పీకర్‌ తంబిదురై, ఆర్థిక మంత్రి జయకు మార్‌ రాజ్‌ భవన్‌లో కలిశారు. ఈ సందర్భంగా తమిళనా డులో చోటు చేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామా లపై గవర్నర్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో తమిళనాట పన్నీర్‌సెల్వం మాట నెగ్గించుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నా డీఎంకే నుంచి శశికళ, దినకరన్‌ కుటుంబాలను బహిష్కరించాలని షరతు పెట్టిన పన్నీర్‌సెల్వం దానిని సాధించుకున్నారు. అనంతరం పార్టీ జనరల్‌ సెక్రటరీగా తానే కొనసాగాలని డిమాండ్‌ చేశారు. దీనిని కూడా పళనిస్వామి వర్గం అంగీకరించినట్టు తెలుస్తోంది. అయితే, పార్టీ జనరల్‌ సెక్రటరీయే ముఖ్యమంత్రిగా కొనసాగడం సంప్రదాయమని, అంతే కానీ, పార్టీ జనరల్‌ సెక్రటరీ ఒకరి వద్ద మంత్రిగా ఉండే సంప్రదాయం లేదని పన్నీర్‌సెల్వం వర్గం మెలిక పెట్టింది. దీనితో విలీన ప్రక్రియ ఆగిపోయింది. పళనిస్వామితో పన్నీర్‌సెల్వం సమావేశమైన అనంతరం దీనిపై ఒక స్పష్టత వచ్చిందని చెబుతూ, తంబిదురై, జయకుమార్‌ గవర్నర్‌ను కలిసేందుకు వెళ్లిన నేపథ్యంలో తమిళనాడులో పన్నీర్‌సెల్వం పంతం నెగ్గించుకున్నారని, అధికార బదలీ జరుగుతుందంటూ వార్తలు వెలువడుతున్నాయి.


చెనై్న : తమిళనాడు రాజకీయాలు మరోసారి కీలక మలుపు తిరిగాయి. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి పక్కన పెట్టే దిశగా ఇప్పటి వరకు పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాల మధ్య జరిగిన చర్చలు బెడిసికొట్టినట్టు తెలుస్తోంది. ఇరు వర్గాలు కలసిపోయాయి, ప్రకటన వెలువడడమే ఆలస్యం అనుకున్న తరుణంలో పరిస్థితి మళ్లీ ముందుకే వచ్చింది. తమపై పళనిస్వామి వర్గం తప్పుడు ప్రచారం చేస్తోందని పన్నీర్‌సెల్వం వర్గీయులు మండిపడుతున్నారు. చర్చల సందర్భంగా తాము ఎలాంటి డిమాండ్లూ పెట్టలేదని వీరు అంటున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పదవులను తాము అడగలేదని, అమ్మ జయలలిత మృతిపై విచారణ జరిపించాలని మాత్రమే అడుగుతున్నామని పన్నీర్‌ వర్గ నేతలు చెబుతున్నారు. శశికళ కుటుంబాన్ని పార్టీకి దూరంగా ఉంచాలనేదే తమ అభిమతమని చెప్పారు. ఎంపీ తంబిదురై, మంత్రి జయకుమార్‌ పరిపక్వత లేని నేతల్లా మాట్లాడుతున్నారని వారు మండిపడ్డారు.


 తమిళనాడులో రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారిన విషయం తెలిసిందే. పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గం విలీనం దిశగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో పన్నీర్‌ వర్గానికి చెందిన కీలక నేత కేపీ మునుస్వామి గురువారం పలు వ్యాఖ్యలు చేశారు. శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి అధికారంగా బహిష్కరిస్తేనే ఓపీఎస్‌, ఈపీఎస్‌ వర్గాల విలీనం జరుగుతుందని ఆయన అన్నారు. పళనిస్వామి వర్గం నేతల వ్యాఖ్యలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బెంగళూరు జైలులో ఉన్న శశికళే ఈ వ్యవహారమంతా నడిపిస్తున్నట్లు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో విలీనం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. అలాగే జయలలిత మృతిపై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్‌ చేశారు.


చెనై్న : తమిళనాడులో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాలు విలీనం దిశగా చర్చలు జరుపుతున్న నేపథ్యంలో అన్నా డీఎంకే సీనియర్‌ నేత, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌ ఎం. తంబిదురై గురువారం ఆ రాష్ట్ర గవర్నర్‌ విద్యాసాగర్‌ రావును కలిశారు. దీంతో గవర్నర్‌ వద్దకు ఆయన ఏదో పెద్ద పని మీదే వెళ్లారని అంతా అనుకున్నారు. అయితే, గవర్నర్‌తో తన భేటీపై స్పందించిన తంబిదురై  తాను మర్యాదపూర్వకంగానే ఆయనను కలిశానని అన్నారు. తాను రాజకీయాల గురించి గవర్నర్‌తో మాట్లాడలేదని ఆయన చెప్పారు.  మరో వైపు పళనిస్వామి, పన్నీర్‌సెల్వం వర్గాల విలీనం జరగాలంటే అంతకు ముందే శశికళ, దినకరన్‌లను పార్టీ నుంచి అధికారికంగా బహిష్కరించాలని పన్నీర్‌ వర్గం డిమాండ్‌ చేస్తోంది.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com