ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పండుగలా వ్యవసాయం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 21, 2017, 01:34 AM

హైదరాబాద్‌, సూర్యప్రధానప్రతినిధి : తెలంగాణలోని రైతులందరికీ పంటల సాగుకు అవసరమైన పరిజ్ఞానం, వ్యవసాయ శాఖ మద్దతు, పెట్టుబడికి కావాల్సిన సహాయం, మార్కెటింగ్‌ సౌకర్యం ప్రభుత్వం తరుపున అందిస్తామని, వ్యవసాయాన్ని పండుగలా మార్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు ప్రకటించారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు ఆగాలని, తెలంగాణలో వ్యవసాయం దేశానికే ఆదర్శం కావాలని, అన్నం పెట్టే రైతుకు సమాజంలో గౌరవం పెరగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఎన్ని వేల కోట్లయినా సరే రైతుల కోసం ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని సిఎం వెల్లడించారు. ఎరువుల కొనుగోలు కోసం ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించే పథకంతో పాటు రైతు సంఘాల ఏర్పాటు కోసం తీసుకున్న నిర్ణయాలను అమలు చేయడానికి అవలంభించాల్సిన విధానంపై గురువారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌. నిరంజన్‌ రెడ్డి, ఎమ్మెల్యీ కొండా సురేఖ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్ధసారథి, వ్యవసాయ విశ్వవిద్యాలయం విసి ప్రవీణ్‌ రావు, ఉద్యానవన శాఖ కమిషనర్‌ వెంకట్రామ్‌ రెడ్డి, సిఎంఓ ముఖ్యకార్యదర్శి  ఎస్‌.నర్సింగ్‌ రావు, కార్యదర్శి స్మితా సభర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు. పెరుగుతున్న పెట్టుబడి భారాన్ని పంచుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎరువుల కొనుగోలుకయ్యే నాలుగు వేల రూపాయల భారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. దానితో పాటు మార్కెటింగ్‌ సౌకర్యాలు కూడా మెరుగు పరుస్తున్నాం. మద్దతు ధర రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేస్తాం. ఇప్పటికే 20.5 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను సిద్దం చేసిపెట్టాం. వ్యవసాయ శాఖను కూడా బలోపేతం చేద్దాం. కొత్తగా నియామకమైన వ్యవసాయ అధికారులతో కలిపి తెలంగాణలో ఇప్పుడు 2112 మంది వ్యవసాయాధికారులు అందుబాటులో ఉన్నారు. ప్రతీ 5వేల ఎకరాలకు ఒక అధికారిని నియమిస్తాం. వ్యవసాయ శాఖలో వెంటనే ప్రమోషన్లు ఇవ్వాలి. ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి. వ్యవసాయ విశ్వ విద్యాలయానికి పూర్వ వైభవం కావాలి. విశ్వ విద్యాలయంలో పరిశోధనలు పెరగాలి. వ్యవసాయ శాఖ అధికారులను అధ్యయనం కోసం ఇజ్రాయిల్‌ పంపాలి. కొత్త పద్దతులు తెలుసకుని తెలంగాణ రైతులకందివ్వాలి. సాగులో కొత్త పద్దతులు వస్తున్నాయి. ఉత్పత్తి పెరగడమే కాదు. ఉత్పాదకత పెరగాలి. అందకోసం నూతన విధానాలు అవలంభించాలి అని ముఖ్యమంత్రి కోరారు 


తెలంగాణలోని  వ్యవసాయ భూములను క్రాప్‌ కాలనీలుగా మారుస్తాం. భూసారం, వర్షపాతం, ఉష్ణోగ్రతలను అనుసరించి ఏ ప్రాంత రైతులు ఏ రకం పంట వేయాలనే విషయంలో అధికారుగు తగు సూచనలు చేయాలి. దానికనుగుణంగానే రైతులు పంటలు వేయాలి. అప్పుడు ప్రతీ రైతు తాను పండించిన పంటకు మంచి ధర పొందడం సాధ్యమవుతుంది. గ్రామాల్లో రైతు సంఘాలు ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ కార్యక్రమాలన్నింటినీ గ్రామ రైతు సంఘాలు సమన్వయం చేస్తాయి. గ్రామాల్లో వ్యవసాయ భూములు ఎవరి వద్ద ఉన్నాయి? వాటి స్థితి ఎలా ఉంది? అనే విషయాలపై సరైన రికార్డులు నిర్వహించాలి. క్రయ విక్రయాలు జరిగినప్పుడు వెంటనే గ్రామస్థాయిలో కూడా రికార్డులు మార్చాలి. రిజిస్ట్రేషన్‌ శాఖకు కూడా దీనికనుగుణంగా ఆదేశాలు జారీ చేస్తాం. ఎక్కడికక్కడ భూసార పరీక్షలు నిర్వహించడానికి మినీ లాబరేటర్ల సంఖ్యను కూడా పెంచుతాం అని సిఎం ప్రకటించారు.  రాష్ట్రంలో ఏఏ ఆహార ధాన్యాల డిమాండ్‌ ఎంత ఉంది? ఏ పంటకు ఎక్కువ డిమాండ్‌ ఉంది? ఏ పంటకు మార్కెట్‌ ఉంది? అనే విషయాలను గమనించి పంటలు సాగు చేసే విధంగా రైతులకు అవగాహన కల్పించాలి. కూరగాయలు, పండ్లు, పూలు కూడా వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణకు దిగుమతి కావద్దు. మనకు కావాల్సినవి మనమే ఉత్పత్తి చేసుకోవాలి. నాణ్యమైన విత్తనాలే రైతుకు అందే విధంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై పిడి యాక్టు నమోదు చేసి జైలుకు పపుతామని సీఎం స్పష్టంచేశారు. ఇందుకోసం అవసరమైతే కొత్త చట్టం తెస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com