కానిస్టేబుల్స్ శిక్షణకు ఏర్పాట్లు చేయండి

  Written by : Suryaa Desk Updated: Fri, Apr 21, 2017, 04:36 PM
 

రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన కానిస్టేబుల్ తుది పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇచ్చేందుకు పోలీస్ శాఖ సిద్ధమవుతోంది. ఎంపిక చేసిన 8 వేల మందికిపైగా స్టైపండరీ క్యాడెట్ ట్రైనీ పోలీసు కానిస్టేబుల్ (SCTPCS) అభ్యర్థుల రిపోర్టింగ్, శిక్షణ కార్యక్రమాలకు క్షేత్ర స్థాయి అధికారులు మౌలిక వసతుల ఏర్పాటుకు శ్రద్ధ తీసుకోవాలని డీజీపీ అనురాగ్ శర్మ జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లను ఆదేశించారు. హైదరాబాద్ లోని తన కార్యాలయం నుంచి ఆయన వారితో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు.


ఎస్సీటీపీసీఎస్ అభ్యర్థుల రిపోర్టింగ్, శిక్షణపై డీజీపీ పలు సూచనలు ఇచ్చారు. పాత జిల్లాలు, బెటాలియన్ కేంద్రాలలో అభ్యర్థుల రిపోర్టింగ్, శిక్షణ కార్యక్రమాలకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో ఎటువంటి లోటుపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. శిక్షణలో అభ్యర్థులకు మంచి అనుభవం పెంపొందించే విధంగా సిలబస్ తయారు చేశామని, కంప్యూటర్ పరిజ్ఞానం పెంచేందుకు ప్రత్యేక శిక్షణ ఇస్తామన్నారు. తెలంగాణ పోలీస్ ఆధునిక పరికరాలు, కంప్యూటర్, ఇంటర్నెట్ ద్వారా విధి నిర్వహించడం, శిక్షణ అనంతరం అభ్యర్థి నేరుగా పోలీస్ స్టేషన్, బెటాలియన్ లో విధులు నిర్వహించేందుకు వీలుగా శిక్షణ ఇస్తామన్నారు. దూర ప్రాంతాల నుండి రిపోర్ట్ చేసే అభ్యర్థులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, టీఎస్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చైర్మన్, అడిషనల్ డీజీ పూర్ణచంద్ర రావు, ట్రైనింగ్ ఐ.జి చారు సిన్హా తదితరులు పాల్గొన్నారు.