ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగుభాషాభివృద్ధి ప్ర‌పంచానికి తెలియాలి

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2017, 11:47 AM

హైద‌రాబాద్‌:  తెలుగు భాష, సాహిత్యాభివృద్ధికి రాష్ట్రంలో జరిగిన కృషి ప్రపంచానికి తెలిసేలా ప్రపంచ తెలుగు మహాసభలను ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.మహాసభల సన్నాహక సమావేశం ప్రగతిభవన్ లో జరిగింది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీన హైటెక్స్ వేదికగా తెలుగు మహాసభల అంకురార్పణ జరగనుంది. అంకురార్పణ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నసాహితీ ప్రముఖులు, తెలుగు పండితులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అంకురార్పణ తర్వాత వారం, పది రోజుల పాటు సభలు నిర్వహించాలని, వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించిన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని చెప్పారు.పగటి పూట సభలు, సదస్సులు, రాత్రి సమయంలో పేరిణీ సహా వివిధ రకాల కళారూపాలను ప్రదర్శించాలని సీఎం తెలిపారు. ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు భాషాభివృద్ధి, సాహితీ ప్రక్రియలో విశేష కృషి చేసిన వారిని మహాసభలకు ఆహ్వానించి గౌరవించాలని సీఎం స్పష్టం చేశారు. తెలుగు భాషా వికాసానికి ఎందరో మహానుభావాలు కృషి చేశారని, పోతన నుంచి మొదలుకుంటే ఆధునిక సాహిత్యం వరకు అనేక రచనలు, సాహిత్య ప్రక్రియలను సుసంపన్నం చేసిన వారందరినీ స్మరించుకోవాల్సిన అవసరం ఉందని కేసీఆర్ అన్నారు. సంప్రదాయ, అవధాన, ఆధునిక సాహిత్యంలో రాష్ట్ర వ్యక్తులు చేసిన కృషి తెలిసేలా సాహిత్య సభలు నిర్వహించాలని... సినీ, పాత్రికేయ, కథారచన, నవలా, కవిత్వం, హరికథ, బుర్రకథ, యక్షగానం, చందోబద్ధమైన ప్రక్రియలు ఇలా రాష్ట్ర సాహితీమూర్తులు ప్రదర్శించిన ప్రతిభా పాటవాలు ప్రధానాంశాలుగా మహాసభలు జరగాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మహాసభల్లో భాగంగా కవి సమ్మేళనాలు, సాహిత్య గోష్టులు, అవధానాలు నిర్వహించాలని, విద్యార్థులకు వ్యాసరచన, వకృత్వ, కవితా పోటీలు నిర్వహించాలని తెలిపారు. తెలంగాణ ప్రముఖులు రాసిన వ్యాసాలు, సాహిత్య రచనలను ముద్రించాలని కేసీఆర్ చెప్పారు. తోటి తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ తో పాటు ముంబయి, సూరత్, బీవండి, దిల్లీ, చెన్నై, బెంగళూరు, షోలాపూర్, ఒడిశా తదితర ప్రాంతాల్లో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారిని మహాసభలకు ఆహ్వానించాలని సూచించారు. అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, మలేషియా, గల్ఫ్ తదితర దేశాల్లోనూ తెలుగు భాష, సాహిత్యానికి సేవలందిస్తున్న వ్యక్తులు, సంస్థలను కూడా భాగస్వామ్యుల్ని చేయాలని సీఎం తెలిపారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com