ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆగని కలప దందా మూడు రాష్ట్రాల మధ్య యథేచ్ఛగా రవాణా

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, May 06, 2017, 12:12 PM

ఆగని కలప దందా మూడు రాష్ట్రాల మధ్య యథేచ్ఛగా రవాణాభద్రాచలం డివిజన్‌లో బరితెగింపు ఈనాడు, ఖమ్మంఅక్రమార్కుల స్వార్థం పర్యావరణ పరిరక్షణకు విఘాతం కలిగిస్తోంది. సంపాదనే ధ్యేయంగా అడవులపై పడి వృక్ష సంపదను తెగనరుకుతూ..మానవ మనుగడను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ముఖ్యంగా భద్రాచలం డివిజన్‌లో స్మగ్లర్లు చెట్లను నేలకూల్చడం, దుంగలుగా మార్చి తరలించడం, మరికొన్నిచోట్ల సామగ్రి తయారు చేయించి వివిధ మార్గాల ద్వారా అక్రమ రవాణా చేయడం పరిపాటైంది. విలువైన అటవీ సంపద తరిగిపోతున్నా.. సంబంధిత అధికారులు నామమాత్రపు దాడులతో చేతులు దులుపుకొంటున్నారనే ఆరోపణలున్నాయి.భ ద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా అనగానే ఒకపుడు అటవీ సంపదకు నిలయం, పచ్చదనానికి ప్రతీకగా పేరుగాంచింది. నాటి వైభవం క్రమంగా మసకబారుతోంది. చర్ల సమీపంలోని అటవీ సంపద యథేచ్ఛగా తరలిపోతోంది. ఉభయ జిల్లాల్లో కలప అక్రమ రవాణా సాగుతున్నప్పటికీ ఆ తరలింపునకు కేంద్ర బిందువు భద్రాచలం డివిజన్‌ కావడం గమనార్హం. మూడు రాష్ట్రాలకు సమీపంలో డివిజన్‌ ఉండటం కూడా ఇందుకు దోహదం చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, ఆంధ్రప్రదేశ్‌తోపాటు రాష్ట్రంలోని ఖమ్మం, భూపాలపల్లి, వరంగల్‌, మహబూబాబాద్‌ తదితర జిల్లాలకు దుంగలు, సామగ్రి ఇక్కడి నుంచే తరలివెళ్తొంది. భూపాలపల్లి జయశంకర్‌ జిల్లా వెంకటాపురం మండలం ఆలుపాక, ఎదిర, వెంకటాపురం అటవీ బీట్‌ పరిధిలో కలప నానాటికీ తరిగిపోతోంది. చెట్లను నరికివేసి కలపను దుంగలుగా తయారు చేస్తున్నారు. ఇవి రవాణాకు అనుకూలం. అంతేకాకుండా తీసుకెళ్లిన వ్యక్తి తనకు నచ్చిన విధంగా సదరు దుంగలను ఫర్నీచర్‌గా మార్చుకొనే వీలుంది. ఫలితంగా వీటికి గిరాకీ ఎక్కువ. 5, 6 అడుగులు ఉన్న దుంగ ధర రూ.3 వేల వరకు, రెండు, ఒకటిన్నర అంగుళాలు ఉన్న చెక్కలకు రూ.1,600 నుంచి రూ.2,400 వరకు విక్రయిన్నారు. సదరు దుంగలు తదితర భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రమైన కొత్తగూడెం, గోదావరి అవతలి ప్రాంతమైన మణుగూరు, ఏటూరునాగారం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికితోడు వెంకటాపురం సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ నుంచి కలప వాజేడు సమీపంలోని లొటపిటగండి నుంచి వస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపేట, వెంకటాపురం మండలం తిప్పాపురం ప్రాంతం నుంచి అధిక మొత్తంలో కలప తరలిస్తున్నారు.దుమ్ముగూడెం మండలం ఆర్లగూడెం, కమలాపురం, పర్ణశాల, కాట్కూరు మీదుగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం నుంచి కలపను జిల్లాలోకి తీసుకువస్తున్నారు. వీటిని మణుగూరు, భద్రాచలం తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదే అదునుగా భావించి చర్ల మండలంలో ఎక్కడైనా కలప పట్టుబడితే ఛతీస్‌గఢ్‌ నుంచి వచ్చిందంటూ దులిపేసుకోవడం పరిపాటిగా మారింది.మిర్చి బస్తాల కింద కలప దుంగలు.. కలప దందాను అక్రమార్కులు చాలా చాకచక్యంగా సాగిస్తున్నారు. తొలుత చెట్లను నరికి తర్వాత వాటిని దుంగలుగా చేసి వివిధ మార్గాల ద్వారా తరలించేస్తున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చెట్లను నరికి దుంగలు తయారు చేసిన తర్వాత తరలింపు పెద్ద సవాల్‌తో కూడిన వ్యవహారం. ఎక్కడైనా ఎక్కువ మొత్తంలో తరలించి పట్టుబడితే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. వీటన్నింటిని అధిగమించి పని సులువు కావాలంటే కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తరలించడంపై మాఫియా దృష్టి సారించింది. ప్రస్తుతం మిర్చి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని మిరప బస్తాల కింద కలప దుంగలను, సామగ్రిని లక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మరికొందరు కారు డిక్కీలు, డీసీఎం వ్యానులను ఆశ్రయిస్తున్నారు. ఇంకొందరు రాత్రివేళల్లో దూర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సులను లక్ష్యంగా చేసుకొని దందా కానిచ్చేస్తున్నారు. రాత్రివేళ తనిఖీలు తక్కువగా ఉంటాయన్న కోణంలో ఇలా కలపను ఎక్కువ శాతం తరలించేస్తున్నారు. ఫలితంగా భద్రాచలం డివిజన్‌లో తయారవుతున్న దుంగలు మైదాన ప్రాంతమైన ఖమ్మం జిల్లాకు చేరుతున్నాయి. అక్కడ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాలకు వెళ్తున్నాయి. ఇల్లెందు అటవీ ప్రాంతంలోనూ కలప అక్రమ రవాణా కొనసాగుతోంది. ఇల్లెందు, కారేపల్లి తదితర ప్రాంతాల నుంచి దుంగలు వివిధ ప్రదేశాలకు తరలివెళ్లడం నిత్యకృత్యంగా మారింది. కలప అక్రమ రవాణాను అరికడితేనే ప్రకృతి సంపద పదికాలాలపాటు పదిలంగా ఉండటంతోపాటు సృష్టి లయ తప్పకుండా కాపాడిన వారమవుతాం.


అక్రమ రవాణా నివారణకు చర్యలు రాంబాబు, కొత్తగూడెం డీఎఫ్‌వో కలప అక్రమ రవాణా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం. పెట్రోలింగ్‌ వేగం పెంచుతాం. రాత్రివేళల్లో రవాణా నిరోధానికి మరిన్ని చర్యలు తీసుకుంటాం. చెక్‌పోస్టుల వద్ద మరింత పకడ్బందీగా చర్యలు తీసుకోవడంతోపాటు సిబ్బంది రోటేట్‌ చేస్తాం. చర్ల ప్రాంతంలో కలప రవాణా నిరోధానికి గతంలో చర్యలు తీసుకున్నాం. రానున్న కాలంలో పక్కా ప్రణాళికతో కలప రవాణాను అడ్డుకుంటాం. ఆ దిశగా శాఖపరంగా చర్యలు ఉంటాయి.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com