నిషిత్‌ మరణంలో నమ్మలేని నిజాలు

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:09 AM
 

  హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ : నిషిత్‌ నారాయణ రోడ్డు ప్రమాదంలో రోజుకు ఒక కోణం బయటపడుతోంది. ముందు అతివేగం వల్లే ప్రమాదం జరిగిందని భావించిన ఘటన జరిగిన తీరు అందరినీ ఆలోచనలో పడేసింది. ప్రమాదానికి కారణం కేవళం అతివేగం కాదని, మానవ తప్పిదం దాటి యాంత్రిక లోపాలు ఉన్నాయని వాహనాన్ని పరిశీలించిన నిపుణులు చెప్పారు. అంతే కాదు. ప్రమా దం జరిగిన సమయంలో అందరూ అనుకున్నట్లు వాహనం 200 కిలో మీటర్ల వేగంతో ప్రయాణించలేదని పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయంలో అన్ని ఎయిర్‌ బ్యాగులు తెరచుకోకపోవడంతో పాటు ఇంజన్‌ సైతం ముందు సీటులోకి నెట్టుకుని రావడం వాహనంలో భద్రతపరమైన అనుమానాలకు తావిస్తోంది. బెంజ్‌ కంపెనీకి చెందిన ఈ ఎఎంజి 63కి చెందిన కారు రకరకాల క్రాస్‌ టెస్టుల్లో దృఢమైన వాహనంగా పేరు తెచ్చుకున్నా ఇప్పటిి వరకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ప్రమాదాల్లో వాహనాలు నుజ్జునుజ్జయిన దాఖాలాలే ఎక్కువ. అయితే కంపెనీకి ఉన్న మంచి పేరుతోనే ఈ ఎఎంజి సీరీస్‌ నెట్టుకువస్తున్నదని ఆటో టెక్నికల్‌ ఎనలిస్టుల మాట. రెండున్నర కోట్ల రూపాయలు విలువ చేసే ఈ వాహనంలో సుమారు కోటి రూపాయల వరకు భద్రత చర్యల కోసమే ఖర్చు పెట్టినట్లు కంపెనీ చెబుతోంది.


    కారు బరువు 2.5 టన్నులు అయినా నిషిత్‌ ప్రమాదంలో ఇంజన్‌ సైతం తునాతునకలై క్యాబిన్‌లోకి చొచ్చుకురావడం అందులోని భద్రత చర్యలను ప్రశ్నిస్తోంది. ప్రమాద సమయంలో టెలిస్కోపీ స్టీరింగ్‌ రాడ్‌ సైతం పని చేయపోవడంతో నితిష్‌ ఛాతీకి బలంగా తగిలింది. స్టెర్నమ్‌ బోన్‌ విరిగి ఊపిరితిత్తులకు పంచర్‌ జరిగి మరణించాడని పోస్టుమార్టంలో తేలింది. పోస్టుమార్టం రిపోర్టు నేపథ్యంలో హైదరాబాద్‌ పోలీసులు సాంకేతికపరమైన అంశాలపైనా దృష్టి పెట్టి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సమగ్ర సాంకేతిక నివేదిక ఇవ్వాలని బెంజ్‌ కంపెనీ యాజమాన్యాన్ని కోరారు. అందు కోసం కంపెనీకి వారం రోజుల గడువు ఇచ్చారు. జర్మనీ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులు గురువారం ప్రమాద స్థలాన్ని వాహనాన్ని పరిశీలించారు. వారు ఇచ్చే నివేదిక కేసులో కీలకం కానుంది. పోలీసులు గట్టిగా కలుగజేసు కుంటున్న తరుణంలో ఘటనపై ఆ సంస్థ అధికారిక ప్రకటన చేయవలసిన అవసరం ఏర్పడింది. అయితే, కంపెనీ తన పలుకుబడిని ఉపయోగించుకుని ఈ చిక్కు నుంచి బయటపడే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. వారు ఇచ్చే సాంకేతిక నివేదిక ఆధారంగా నిషిత్‌ కుటుంబ సభ్యులు కోర్టులో కేసు వేసే అవకాశం ఉంది.