వాహనాల పొగ చెత్తను కాల్చడంపై ప్రత్యేక దృష్టి

  Written by : Suryaa Desk Updated: Sat, May 20, 2017, 02:21 AM
 

హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః వాహనాలు వెదజల్లే పొగతోపాటు ప్రజలు కాల్చుతున్న చెత్త వల్ల వాతావరణంలో ప్రమాదకరంగా పెను మార్పులు సంభవిస్తున్న నేపథ్యంలో ప్రత్యేక దృష్టిని సారించి పొల్యూషన్‌ను అదుపు చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు మంత్రి జోగు రామన్న తెలిపారు. శుక్రవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టీఎస్‌ పీసీబీ) సభ్య కార్యదర్శి సత్యనారాయణ రెడ్డితో కలిసి పీసీబీ కార్యకలాపాలను మంత్రి సమీక్షించారు. వాహనాల పొగను, చెత్తను కాల్చడంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వాహనాల పొగ, చెత్తను కాల్చడంపై మున్సిపల్‌, రోడ్లు, భవనాలు, పర్యావరణం, ఆర్టీసీ, ట్రాఫిక్‌ పోలీస్‌ పీసీబీ శాఖలు సంయుక్తంగా సమావేశాన్ని నిర్వహించి తగిన నిర్ణయం తీసుకోవాలని మంత్రి జోగు రామన్న తెలిపారు. వాహనాల కాలుష్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ జంట నగరాల్లో మొత్తం 25.31లక్షల వాహనాలు ఉండగా, అందులో సీఎన్‌జీ వాడే వాహనాలు కేవలం 13,516 వాహనాలు మాత్రమే ఉన్నాయని తెలిపారు. సీఎన్‌జీ వాహనాల వాడకం పెరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. కాలుష్య వ్యర్థాల డంపింగ్‌పై సీసీ కెమెరాలతో నిరంతరంగా నిఘాను మరింత పెంచాలని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని 31 జిల్లాల్లోని పరిశ్రమల ప్రాంతాల్లో హరితహారం కింద మొక్కలు నాటి గ్రీన్‌ బెల్ట్‌గగా మార్చేందుకు కార్యాచరణ ప్రణాళికను తక్షణం సిద్దం చేయాలని మంత్రి జోగు రామన్న సూచించారు.