ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్నా చౌక్‌ను ఎత్తివేస్తే ఖబడ్దార్‌ ?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 26, 2017, 02:03 AM

 - ప్రభుత్వం తన నిర్ణయాన్ని విరమించుకోవాలి
 -ఇది ప్రజా హక్కులను కాలరాయడమే
 -సచివాలయం-సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తాం
 -బీసీ నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య
హైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌ః ప్రజా సమస్యలపై నిరసన తెలిపే ధర్నా చౌక్‌ వేదికను నగర శివారు ప్రాంతానికి తరలిస్తే సహించేది లేదని బీసీ నేత, ఎమ్మెల్యే ఆర్‌.కృష్ణయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని  వెంటనే విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. శనివారం బీసీ సంఘాల నేతలు డాక్టర్‌ ర్యాగ అరుణ్‌, జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, భూపేష్‌ సాగర్‌, రామకృష్ణ,  నందగోపాల్‌, వి.గజేందర్‌తో కలిసి ఆయన ధర్నా చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలకు తమ నిరసన తెలిపేందుకు ర్యాలీలు, ధర్నాలు, నిరాహార దీక్షలు జరిపేందుకు ఇది అనుకూలమైన ప్రాంతమని చెప్పారు. ప్రజల గొంతు నొక్కేందుకు నిర్లక్ష్యంగా ధర్నా చౌక్‌ను ఎత్తివేయాలని చూస్తే ఖబడ్దార్‌ అంటూ హెచ్చరించారు. దేశ రాజధాని డిల్లీలోనే పార్లమెంటుకు కూత వేటు దూరంలో జంతర్‌-మంతర్‌ వద్ద ధర్నాలు, ర్యాలీలు జరుపుతున్నారని ఆయన తెలిపారు. గత 19 ఏళ్ల క్రితం సచివాలయం వద్ద అసెంబ్లీ సమయంలో ధర్నాలు, ర్యాలీలు జరిపే వారని, రెండు సార్లు జరిగిన లాఠీచార్జీ వల్ల, ఇందిరాపార్క్‌ వద్దకు మార్చారని చెప్పారు. ఇప్పుడు ఏకంగా నగర శివారు ప్రాంతానికి తరలించాలని చూడటం అత్యంత దుర్మార్గమన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యమాలను అణచివేయాలనే ఆలోచనను విరమించుకోవాలన్నారు.
 ఇప్పటికే తెలుగు సంక్షేమ భవన్‌ వద్ద ధర్నాలు నిషేదించారని, ఇప్పుడు ఏకంగా ఇందిరాపార్క్‌ వద్ద నిషేదించాలను కోవడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని మార్చుకోవాలని, లేని పక్షంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, ముఖ్యమంత్రి నివాసం వద్ద, సచివాలయం వద్ద ధర్నాలు, ర్యాలీలు, దీక్షలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, జైలుకైనా వెళ్లేందుకు సిద్దంగా ఉన్నామని కృష్ణయ్య స్పష్టం చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa