ఎన్నికల యుద్ధం వచ్చాక చూద్దాం
Updated: Sat, May 20, 2017, 03:04 AM

-తన రాజకీయ ప్రవేశంపై రజనీ కాంత్‌


చెన్నై : వరుసగా ఐదవ రోజు శుక్రవారం తన అభిమానులతో సమావేశమైన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌, తన రాజకీయ ప్రవేశంపై మరింత స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. అభిమానులను ఉద్దేశించి రజనీ మాట్లాడుతూ, రాష్ట్రంలో రాజకీయ వ్యవస్థ మారాల్సి ఉందని అన్నారు. తిరుచ్చి, అరియలూరు, తిరంబ లూరు ప్రాంతాలకు చెందిన అభిమానులతో భేటీ అయిన ఆయన, రాజకీయా ల్లో మార్పును మనం తీసుకురావాలని అన్నారు. యుద్ధం ఇప్పుడు కాదని, యుద్ధం వచ్చినప్పుడు చూద్దామని తనదైన శైలిలో మాట్లాడారు. రాజకీయా ల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్న సంకేతాలు ఇస్తూ  సాగిన ఆయన ప్రసంగంలో డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్‌పై పొగడ్తల వర్షం కురిపించారు. స్టాలిన్‌లో తనకో నేత కనిపిస్తాడని, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే, అవి మరింత ఫలవంతమవుతాయని అన్నారు. తాను రాజకీయాల గురించి మాట్లాడిన మాటలు వివాదాస్పదమవుతాయని భావించలేదని అన్నారు. తనకు అభిమానులే బలమని, వారు వెన్నంటి ఉండగా, తనకు అపజయమన్నదే కలగదన్న నమ్మకముందని చెప్పారు.


‘40 ఏళ్లుగా తమిళనాడులోనే ఉంటున్నాను.. నేను తమిళుడినే’ అని సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ స్పష్టం చేశారు. చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో తిరుచ్చి, అరియలూరు, తిరంబలూర్‌ జిల్లాలకు చెందిన అభిమానులతో సమావేశమైన సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ, సోషల్‌ మీడియాలో వచ్చే విమర్శలను పట్టించుకోనని స్పష్టం చేశారు. విమర్శలు సర్వసాధారణమని ఆయన చెప్పారు. మన వ్యవస్థ (సిస్టమ్‌)లోనే లోపాలు ఉన్నాయని ఆయన చెప్పారు. చెడ్డ రాజకీయ నాయకులతో పాటు, నలుగురు మంచి నాయకులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. కాగా, అభిమానులతో ఐదవ రోజు సమావేశమవుతున్న రజనీ రాజకీయ రంగ ప్రవేశంపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని అంతా ఆశగా ఎదురు చూస్తున్నారు.


శుక్రవారం చెన్నైలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలో అభిమానులతో రజనీ సమావేశమైన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. రజనీ ప్రసంగం ముగిసిన తరువాత, అభిమానులతో ఫోటో సెషన్‌ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రజనీకాంత్‌ కుర్చీలో కూర్చుని ఉంటే, అభిమానులు ఒక్కొక్కరుగా వచ్చి ఆయన పక్కన నిలబడి ఫోటోలు దిగుతున్నారు. గత ఐదు రోజులుగా రోజుకు దాదాపు 600 నుంచి 700 మందితో ఆయన ఫోటోలు దిగుతున్నారు. శుక్రవారం ఫోటో సెషన్‌కు ముందు ఆయన ఓ దువ్వెన తీసి తనదైన స్టయిల్‌లో జుట్టును దువ్వుకోవడంతో దాన్ని చూసిన అభిమానులు కేరింతలు కొట్టారు. రజనీ కూడా నవ్వుతూ, మరోసారి తన జుట్టును సవరించుకుని ఫోటోలకు సిద్ధమయ్యారు.


తన గురించి సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ చేసిన వ్యాఖ్యల పట్ల డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ స్పందించారు. తనను స్నేహితుడిగా భావించినందుకు రజనీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పారు. రాజకీయ ప్రవేశంపై రజనీ ఒక నిర్ణయం తీసుకోవాలని కోరారు. బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని, తమిళనాడులో పాగా వేయాలని ఆ పార్టీ చూస్తోందని అన్నారు. రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనే సంకేతాలు ఇస్తూ తన అభిమానులను ఉద్దేశించి రజనీ ప్రసంగించిన సంగతి తెలిసిందే. ప్రసంగంలో భాగంగా డీఎంకే నేత, కరుణానిధి కుమారుడు స్టాలిన్‌పై రజనీ పొగడ్తల వర్షం కురిపించారు. స్టాలిన్‌లో తనకో నేత కనిపిస్తాడని, ఆయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటే, అవి మరింత ఫలవంతమవుతాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే రజనీ గురించి స్టాలిన్‌ స్పందించారు.


తమిళ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాలకు పనికిరారని బీజేపీ సీనియర్‌ నేత సుబ్రహ్మణ్యస్వామి మరోమారు వ్యాఖ్యానించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యాధికులైన తమిళ ప్రజలు, అంతగా చదువుకోని రజనీకాంత్‌ను సీఎంగా చూడలేరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రాజకీయాల్లో చదువుకున్న వాళ్లే ఉండగలరని ఆయన అభిప్రాయపడ్డారు. రజనీకాంత్‌తో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తాను వ్యతిరేకిస్తానని అన్నారు. అయినప్పటికీ ఆయనతో పొత్తు కొనసాగిస్తే, పార్టీ అధిష్ఠానం ఇష్టమని అన్నారు. కాగా, రజనీపై సుబ్రహ్మణ్యస్వామి ఇటీవలే విమర్శలు గుప్పించారు. రాజకీయాలకు దూరంగా రజనీకాంత్‌ ఉండాలని సూచించడం విదితమే.

Telangana E-Paper