ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జానారెడ్డి తీరును ప్రశ్నిస్తున్న కాంగ్రెస్‌ నేతలు?

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 01:55 AM

మేజర్‌న్యూస్‌ తెలంగాణ ప్రతినిధిః సిఎల్‌పి నేత జానారెడ్డి పనితీరుపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గత సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 19 అసెంబ్లీ స్థానాలను తన ఖాతా లో వేసుకుంది. రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు జానారెడ్డికి అవకాశం ఇచ్చింది పార్టీ అధిష్ఠానం. గత రెండేళ్లుగా సిఎం కెసిఆర్‌ నాయకత్వంలోని టిఆర్‌ఎస్‌ సర్కార్‌ అనేక విజయాలను సాదించింది. అదే సందర్బంలో గత ఎన్నికల సమయంలో మ్యానిఫెస్టోలో ఇచ్చిన పలు హమీలను విస్మరించింది. అయితే ఇదే అంశాన్ని ప్రజలలోని తీసుకెళ్లడంలో జానారెడ్డి ఘోరంగా విఫలమయ్యారనేది కాంగ్రెస్‌ పెద్దల ఆరోపణ. దీనికి తోడు అధికార పార్టీ చేపట్టిన ఆపరేషన్‌ ఆకర్ష్‌ విజయవంతంగా కొనసాగుతుంది. తొలుత టిడిపిని టార్గెట్‌ చేసిన టిఆర్‌ఎస్‌ నేతలు ఆ తరువాత తమ దృష్టిని కాంగ్రెస్‌ వైపు మళ్లించారు. దీంతో దాదాపు ఏడుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ పార్టీని వీడి టిఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. రేపో, మాపో మరో ఇద్దరు ఎమ్మెల్యేలు కూడ పార్టీ మారుతారన్న ప్రచారం జరగుతుంది. ఇదే జరిగితే కాంగ్రెస్‌ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడ కొనసాగే పరిస్థితులు  ఉండవు. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోయే ప్రమాదం ముంచుకు వస్తుండడంతో కాంగ్రెస్‌ పెద్దలు మేల్కొన్నారని సమాచారం. తెలంగాణలో సీనియర్‌ నేతగా ఉన్న జానారెడ్డి వైఖరి వల్లే పార్టీ రోజు రోజుకు ఇబ్బందుల పాలవుతుందంటున్న అధిష్ఠాన పెద్దలు ఆయన మెతక వైఖరి పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇప్పటికే సిఎల్‌పి నేత మార్పు తప్పదనే సంకేతాలు అధిష్ఠాన పెద్దల నుండి వినపడుతున్నాయి. గుత్తా సుఖేందర్‌ రెడ్డి, బాస్కర్‌రావు తదితరులు పార్టీ మారే సందర్బంలోను జానారెడ్డి తీరుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆయన కూడ తాను తప్పుకునేందుకు సిద్దమనే సంకేతాలు ఇచ్చారు. ఇంతలోనే ఎఐసిసి వ్యవహరాల ఇంఛార్జీ దిగ్విజయ్‌ సింగ్‌ ఆయన సముదాయించారు. కానీ వివిద వర్గాల నుండి దీనిపై నివేదికలు తెప్పించుకున్న అధిష్ఠానం చివరకు జానారెడ్డిని తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. 


సిఎల్‌పి పదవి నుండి తప్పించేందుకు సిద్దమవుతున్న అధిష్ఠానం...


తెలంగాణలో కాంగ్రెస్‌పార్టీ రోజు రోజుకు బలహీనపడుతున్న తరుణంలో అన్ని వేళ్లు సిఎల్‌పి నేత జానారెడ్డి వైపే చూస్తున్నాయి. అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆయన దారుణంగా విఫలమవుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పలువురు యువ ఎమ్మెల్యేలు సర్కారు పై పోరు చేసేందుకు సిద్దంగా ఉన్న వారిని ఆయన ఆపుతున్నారన్న ప్రచారం జరగుతుంది. సిఎం కెసిఆర్‌ తో జానారెడ్డికి ఉద్యమ సమయంలో మంచి సన్నిహిత సంబందాలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పాటు కోసమే ఇద్దరు కలసి పనిచేశారని రాష్ట్రం ఏర్పడిన తరువాత వారి వారి పార్టీలలో సుస్థిర స్థానం ఏర్పాటు చేసుకున్నారని జానా అనుచరులు చెబుతున్నారు. కానీ కెసిఆర్‌ అసెంబ్లీ సాక్షిగా పలు సందర్బాలలో జానారెడ్డిని పొగిడారని ఆయన పెద్దలు జానారెడ్డి గారు అని సంబోదించగానే ఈయన సైలెంట్‌ అవుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటకి రాజకీయాల నుండి రిటైర్‌ అవుతానని జానారెడ్డి ప్రకటించారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అని ఆయన అన్నారు. ఈ పరిస్థితులలో నాగార్జున సాగర్‌ నియోజకవర్గం నుండి తన కుమారున్ని రాజకీయ ఆరంగ్రేటం చేయించడానికి ఆయన ప్రయత్నిస్తున్నారని సమాచారం. అందులో బాగంగా ఇప్పటి నుండే ఆయన టిఆర్‌ఎస్‌ పెద్దలతో టచ్‌లో ఉంటూ పార్టీ నేతలను టిఆర్‌ఎస్‌లోకి పంపిస్తున్నారని పాల్వాయి గోవ ర్దన్‌రెడ్డి లాంటి నేతలు వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన సిఎల్‌పి నేత టిఆర్‌ఎస్‌ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిణామాలు తనను తీవ్రంగా కలచి వేశాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే తానే ముఖ్యమంత్రిని అవుతానని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. 


సిఎల్‌పి రేసులో ముందున్న జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


సిఎల్‌పి నేతగా జానారెడ్డి రాజీనామా చేసిన పక్షంలో ఈ పదవిని సమర్థవంతమైన నాయకుడికి అప్పగించాలని పార్టీ పెద్దలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. అందుకోసం నల్గొండ జిల్లాకే చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, గీతారెడ్డి, జీవన్‌రెడ్డి, డికె అరుణ పోటీపడుతున్నారు. తనకు అవకాశం ఇస్తే ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పార్టీని ముందుకు నడిపిస్తానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధిష్ఠాన పెద్దలకు చెబుతున్నట్లు సమాచారం. కానీ ఇప్పటికే పిసిసి చీఫ్‌ నల్గొండ జిల్లాకే చెందిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉండడంతో  ఆయనకు అవకాశం ఇవ్వకుండా పాలమూరు కు చెందిన డికె అరుణ, కరీంనగర్‌ జిల్లా జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డిల పేర్లను పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తున్నట్లు ఏఐసిసి పెద్దలు అంటున్నారు. పిఎసి ఛైర్మన్‌గా ఉన్న గీతారెడ్డి పేరు కూడ చర్చకు వచ్చినప్పటికి ఆమె ఆసక్తిగా లేరని సమాచారం. దీంతో వీరిద్దరిలో ఒకరికి సిఎల్‌పి పదవిని అప్పగిస్తారని పార్టీలో చర్చ జరుగుతుంది. జిల్లా కమిటీలు, మండల కమిటీలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని టి కాంగ్రెస్‌ పెద్దలు నిర్ణయించారు. మూడు నెలలలో ఈ ప్రక్రియను పూర్తి చేసి ప్రజలలోకి వెళ్లేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. మిగిలిన ఎమ్మెల్యేలను పార్టీ విడిచి వెళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. ప్రతి జిల్లాలో పార్టీని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తూ పనిచేసే వారికి అవకాశాలు ఇవ్వాలని కాంగ్రెస్‌ కార్యకర్తలు అంటున్నారు. సామాజిక సమీకరణలపైన కాంగ్రెస్‌ పెద్దలు దృష్టి సారించారని తెలుస్తోంది. పిసిసి చీఫ్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవులను రెడ్డి, ఎస్‌ సి నేతలను నియమించిన కాంగ్రెస్‌పార్టీ బిసిలకు పార్టీలో ప్రాధాన్యత ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తుంది. ఆ సామాజిక వర్గానికి చెందిన ఓ నేతకు ఢిల్లీలో కీలక పదవి అప్పగించేందుకు రంగం సిద్దం చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తూ పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు ఆరంభించింది. అయితే ఏఐసిసి పెద్దలు చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయోనని రాష్ట్ర కాంగ్రెస్‌ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com