ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పాక్‌ పై ఎలా విరుచుకుపడ్డా వెన్నుదన్నుగా నిలుస్తాం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, May 25, 2017, 02:04 AM

-సైన్యానికి జైట్లీ అభయం


న్యూఢిల్లీ: వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్‌ దుర్మార్గాలను అడ్డుకునేలా సైన్యం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తుందని ఆర్థిక, రక్షణ శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ అభయమిచ్చారు. బీఎస్‌ఎఫ్‌ దళాలకు వెన్నుదన్నుగా నిలుస్తామని తెలిపారు. ఈ మేరకు తన ట్విట్టర్‌ ఖాతాలో ట్వీట్లు పెడుతూ, జమ్మూ కాశ్మీర్‌ లో శాంతి నెలకొనాలంటే, పాక్‌ పై చర్యలు తీసుకోక తప్పదని జైట్లీ అభిప్రాయపడ్డారు. సరిహద్దుల వెంట చొరబాటు యత్నాలను అడ్డుకోవాలని, ఈ దిశగా కౌంటర్‌ టెర్రరిజం చర్యలు సమర్థవంతంగా చేపట్టాలని జైట్లీ పిలుపునిచ్చారు. కాగా, నౌషేరా సెక్టారులో పాక్‌ పోస్టులను ధ్వంసం చేస్తున్న వీడియోలను భారత సైన్యం విడుదల చేయగా, పాకిస్థాన్‌ దాన్ని ఖండించిన సంగతి తెలిసిందే.


జాదవ్‌ ను అరెస్ట్‌ చేసింది పాక్‌ లో కాదు... పన్నాగాన్ని స్వయంగా బయటపెట్టిన ఆ దేశ నిఘా అధికారి


కరాచీ: భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్‌ జాదవ్‌ ను తమ దేశంలోనే అరెస్‌‌ట చేశామని పాకిస్థాన్‌ బుకాయిస్తోందని తేటతెల్లమైంది. జాధవ్‌ ను పాకిస్థాన్‌ లో అరెస్ట్‌ చేయలేదని, ఇరాన్‌ లో పట్టుకున్నామని పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ మాజీ అధికారి, రిటైర్‌‌డ లెఫ్టినెంట్‌ జనరల్‌ అంజాద్‌ షోయబ్‌ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇంతవరకూ అతడిని బెలూచిస్థాన్‌ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్టుగా పాక్‌ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఇరాన్‌ నుంచి వచ్చి తమ దేశంలో ఉగ్రకార్యకలాపాల్లో పాల్గొనేందుకు జాదవ్‌ రాగా, తాము పట్టుకున్నామని పాక్‌ ప్రకటించగా, ఇప్పుడీ అంజాద్‌ వ్యాఖ్యలతో పాక్‌ చెప్పేదంతా అబద్ధమేనని తేలిపోయింది. ఇది లావుండగా, జాదవ్‌ పై తమ దేశ సైనిక కోర్టు మరణశిక్షను విధించినందున ఐసీజేలో త్వరగా విచారణ ముగించి తుది తీర్పు ఇవ్వాలని పాక్‌ ప్రభుత్వం కోరుతోంది. తుది తీర్పు వచ్చేంత వరకూ శిక్షను అమలు చేసే వీలు లేకపోవడం తోనే పాక్‌ ఈ మేరకు ఐసీజే ముందు పిటిషన్‌ వేసిందన్న సంగతి విదితమే.


పాకిస్థాన్‌ ను శిక్షించేందుకు ఉరకలేస్తున్న ఇండియా: యూఎస్‌   ఇంటెలిజన్స్‌ చీఫ్‌


ప్రపంచదేశాల ముందు దౌత్యపరంగా పాకిస్థాన్‌ ను ఏకాకిని చేసే దిశగా విజయవంతమైన అడుగులు వేస్తున్న ఇండియా, ఆ దేశాన్ని శిక్షించేందుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా భావిస్తోందని అమెరికా డిఫెన్స్‌ ఇంటెలిజన్స్‌ చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ విన్సెంట్‌ స్టెవార్ట్‌ వ్యాఖ్యానించారు. సీమాంతర ఉగ్రవాదానికి పాక్‌ నుంచి మద్దతు లభిస్తుందన్న ఆరోపణలతోనే భారత్‌ చర్యలు ఉంటాయని భావిస్తున్నట్టు తెలిపారు. అమెరికాలోని శక్తిమంతమైన కమిటీల్లో ఒకటైన సెనెట్‌ ఆర్మ్డ సర్వీసెస్‌ కమిటీ ముందు మాట్లాడిన ఆయన, పాకిస్థాన్‌ సైతం వెనక్కు తగ్గే ఆలోచనలో లేదని తెలిపారు. కాగా, వాస్తవాధీన రేఖ వెంబడి పాకిస్థాన్‌ పోస్టులపై తాము దాడులు చేశామని చెబుతూ, భారత సైన్యం ఓ వీడియోను విడుదల చేసిన మరుసటి రోజే విన్సెంట్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.


 


ఇక భారత్‌ తన సైన్యాన్ని ఆధునికీకరించే పనిలో నిమగ్నమైందని, సరిహద్దులతో పాటు హిందూమహా సముద్ర ప్రాంతంలో తన ప్రయోజనాలను పరిరక్షించుకునే లక్ష్యాలను నిర్దేశించుకుందని విన్సెంట్‌ తెలిపారు. కాశ్మీరులో హింస కొనసాగుతోందని, ఎప్పుడైనా ఉగ్రదాడులు జరిగే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతూ, గతంలో ఎన్నడూ లేనంత కింది స్థాయికి భారత్‌, పాక్‌ మధ్య బంధం పడిపోయిందని విన్సెంట్‌ వెల్లడించారు. ఇటీవలి కాలంలో పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులు ఇండియాలో పెరిగిపోవడంతో, అందుకు దీటైన సమాధానాన్ని చెప్పాలన్న ఒత్తిడి ప్రజల నుంచి వస్తోందని, అందుకు తగ్గట్టుగానే సైన్యం కదులుతోందని అన్నారు. ఇదే సమావేశంలో ఇండియాతో చైనా సంబంధాలు, ఇస్లామిక్‌ ఉగ్రవాదం, ఉత్తర కొరియా దూకుడు తదితర అంశాలపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com