ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బ్రిటన్‌లో తారస్థారుుకి చేరిన ఉగ్ర భయం

Telangana Telugu |   | Published : Thu, May 25, 2017, 02:05 AM

-2007 తర్వాత తొలిసారి భారీగా మోహరిస్తున్న భద్రతా బలగాలు!


లండన్‌: మాంచెస్టర్‌లో సోమవారం రాత్ర జరిగిన ఉగ్రదాడితో మంగళవారం ఉగ్ర భయం తారస్థాయికి చేరుకుంది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో భద్రతా బలగాలను భారీ ఎత్తున మోహరిస్తున్నట్టు బ్రిటిష్‌ ప్రధాని థెరిసా మే తెలిపారు. ఈ దాడితో పలువురికి సంబంధాలున్నాయని, ఎవరినీ తేలిగ్గా తీసుకోబోమని ఆమె హెచ్చరించారు. సోమవారం రాత్రి మాంచెస్టర్‌ ఎరీనాలో జరిగిన ఉగ్రదాడిలో చిన్నారుల సహా 22 మంది మృతి చెందారు.  ఈ దాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ప్రధాని మాట్లాడుతూ వ్యూహాత్మక ప్రదేశాల్లో విధుల్లో ఉన్న వారి స్థానంలో తాత్కాలికంగా సాయుధ దళాలను మోహరించనున్నట్టు తెలిపారు. కాన్సెర్‌‌టలు, క్రీడలు జరిగే ప్రదేశాల్లో వీరిని మోహరించనున్నట్టు తెలిపారు. 2007లో గ్లాస్గో విమానాశ్రయంలో కారు బాంబు దాడి  తర్వాత మళ్లీ ఆ స్థాయిలో ఉగ్ర భయం తారస్థాయికి చేరుకోవడం ఇదే తొలిసారి. ఇటువంటి దాడులతో ఉగ్రవాదులు విజయం సాధించలేరని, మాంచెస్టర్‌, బ్రిటన్‌ స్ఫూర్తిని దెబ్బతీయలేరని ఈ సందర్భంగా ప్రధాని థెరిసా మే స్పష్టం చేశారు.


మాంచెస్టర్‌ ఉగ్రదాడి నుంచి తృటిలో తప్పించుకున్న భారతీయ వైద్యురాలు!


ప్రపంచాన్ని మరోమారు షాక్‌కు గురిచేసిన మాంచెస్టర్‌ పేలుళ్ల నుంచి భారతీయ వైద్యురాలు, ఆమె కుమార్తె తృటిలో తప్పించుకున్నారు. ఘటన జరగడానికి సరిగ్గా ఏడు నిమిషాల ముందు వారు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టడంతో ప్రాణాలు దక్కించుకోగలిగారు. సోమవారం రాత్రి మాంచెస్టర్‌లో మాంచెస్టర్‌ ఎరీనా వద్ద ఉగ్రదాడి జరగడానికి ముందు జైపూర్‌కు చెందిన వైద్యురాలు సోనాల్‌  పాఠక్‌ (41), ఆమె 13 ఏళ్ల కుమార్తె శ్రేయ, ఆమె స్నేహితురాలు ఆన్య అక్కడే ఉన్నారు. షో చివరిలో రద్దీ నుంచి బయటపడడానికి మా వాహనాన్ని కొంత దూరంలో పార్క్‌ చేశాం. చివరి సాంగ్‌ అయిపోయిన వెంటనే బయటపడేందుకు ఎదురుచూస్తున్నాం. షో అవగానే వడివడిగా అడుగులేస్తూ పార్కింగ్‌ ప్రదేశానికి చేరుకున్నాం. మేం బయటకు వచ్చిన సరిగ్గా ఏడు నిమిషాల తర్వాత పేలుడు సంభవించింది అని పాఠక్‌ గుర్తు చేసుకున్నారు. తాము రాత్రి 10:23 గంటలకు బయటకు వస్తే 10:30 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించిందని తెలిపారు. అయితే తన పార్కింగ్‌ అండర్‌ గ్రౌండ్‌లో ఉండడంతో తాను పేలుళ్లను చూడలేదని, తనకు పేలుడు శబ్దాలు వినిపించలేదని పేర్కొన్నారు. పార్కింగ్‌ నుంచి బయటకు వచ్చాక గానీ ఈ దారుణ ఘటన గురించి తెలియలేదని వివరించారు.  మాంచెస్టర్‌ ఎరీనా వద్ద శక్తిమంతమైన బాంబు పేలడంతో 20 మంది మృతి చెందగా, 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.


మాంచెస్టర్‌ దాడి గురించి ముందే హెచ్చరించిన లాయర్‌


అబుబకర్‌ ప్రకటన అవాస్తవమని కూడా స్పష్టీకరణ!


 మాంచెస్టర్‌ లోని ఉగ్రదాడి గురించి మాక్స్‌ హిల్‌ అనే బ్రిటన్‌ న్యాయవాది ముందుగానే హెచ్చరించినా నిఘా వర్గాలు పట్టించుకోకపోవడంతోనే దాడి జరిగిందని అంటున్నారు. మాక్స్‌ హిల్‌ ఉగ్రవాదులపై పరిశోధనలు చేస్తుంటారు. టెర్రరిజం, బ్రిటిష్‌ చట్టాలపై ఆయన అధ్యయనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆయన ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థపై చాలా పరిశోధన చేశారు. ఈ క్రమంలో రెండు నెలల కిందట ఐఎస్‌ఐఎస్‌ చీఫ్‌ అబుబకర్‌ బాగ్దాదీ వీడ్కోలు ప్రసంగం చేస్తూ... ఐఎస్‌ఐఎస్‌ ఓటమి పాలైందని, మిగిలిన ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులంతా ఆత్మహత్య చేసుకోవాలని సూచించడాన్ని ఆయన కొట్టిపారేశారు. సిరియా, ఇరాక్‌ లలో చావుదెబ్బతిన్న ఐఎస్‌ఐఎస్‌ తన వ్యూహం మార్చుకుందని ఆయన చెబుతున్నారు.


 


ప్రపంచం దృష్టిని మళ్లించేందుకే బాగ్దాదీ ముగింపు ప్రకటన చేశాడని ఆయన హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఆయన ప్రకటనను ఎవరూ నమ్మలేదు. ఇరాక్‌, సిరియాలలో దెబ్బతిన్నప్పుడే వ్యూహం మార్చిన బాగ్దాదీ... బ్రిటన్‌ ను టార్గెట్‌ చేశాడని అంటున్నారు. అందుకే మాంచెస్టర్‌ ఎరీనాలో ఉగ్రదాడికి పాలపడ్డారని, భవిష్యత్‌ దాడులు మరింత తీవ్రంగా, భయంకరంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. కొత్తతరహా దాడులతో అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని ఐఎస్‌ఐఎస్‌ విజృంభిస్తుందని ఆయన తెలిపారు. వెస్ట్‌ లండన్‌ పేలుళ్ల కంటే తీవ్రమైన దాడులకు ఐఎస్‌ఐఎస్‌ వ్యూహరచన చేసిందని ఆయన చెబుతున్నారు. నిఘా వర్గాలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. సిరియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాదులు విరుచుకుపడుతున్న సమయంలో వందలాది మంది బ్రిటన్‌ యువకులు వెళ్లి సిరియాలోని ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రవాద సంస్థలో చేరారని ఆయన చెప్పారు. సిరియాలో ఐఎస్‌ఐఎస్‌ ఉగ్రసంస్థ పూర్తిగా బలహీన పడడంతో వారంతా వెనక్కి తిరిగి వస్తున్నారని, వారితో ప్రమాదమని మాక్స్‌ హిల్‌ చెబుతున్నారు. ఎప్పటికైనా వారంతా దేశానికి, దేశప్రజలకు ప్రమాదకరంగా మారుతారని ఆయన చెబుతున్నారు. 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com