పెళ్ళీడుకొచ్చారు...

  Written by : Suryaa Desk Updated: Mon, Jun 19, 2017, 01:30 AM
 

అందం.. అభినయం.. ఇవి రెండు ఉంటే చాలు ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మార్క్‌ పడినట్టే. ఒక్క సినిమా హిట్‌  అయితే చాలు.. హీరోయిన్‌గా తమ హవా ప్రారంభమైనట్టే. సినిమా పరిశ్రమలో అవకాశాలు ఒక పట్టాన రావనేది వాస్తవం. ఒకవేళ వెతుక్కుంటూ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటే నాలుగు రాళ్ళు వెనకేసుకోవచ్చు. హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ అయిన తరువాత ఎంత తక్కువ టైంలో ఎన్ని ఎక్కువ సినిమాలకు సైన్‌ చేస్తే అంత క్రేజ్‌ వచ్చినట్టే. అందుకు ప్రతి ఒక్కరూ అంది  వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ కెరీర్‌ ప్లాన్‌ చేసేసుకుంటారు. సినిమాలు ఉన్నంత వరకు బిజీగా కనపడే హీరోయిన్‌లు కొంత గ్యాప్‌ వస్తే ఒక్కొక్కరు ఒక్కోలా ప్లాన్‌ చేసుకోవడం మామూలే. అలా చూసుకుంటే గతంలో వెండితెరపై హీరోయిన్‌లుగా అగ్ర హీరోలందరితో సినిమాలు చేసి పెళ్ళి వయసు వచ్చిందని ఏ సాఫ్ట్‌వేర్‌నో, బిజినెస్‌మేన్‌నో, పొలిటీసియన్‌నో పెళ్ళి చేసుకుని లైఫ్‌లో సెటిల్‌ అయిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కొన్నాళ్ళకు పెళ్ళయి ఒకళ్ళిద్దరు పిల్లల్ని కనిన తరువాత మళ్ళీ సినిమా రంగం మీద ఆసక్తి కలిగి రీ ఎంట్రీ ఇవ్వడం కూడా మామూలే. నిన్న మొన్నటి దాకా మన స్టార్‌ హీరోలందరి సరసన నటించి అగ్ర కథానాయికలుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు కొత్త తరం ఇండస్ట్రీలోకి ప్రవేశం చేయడంతో హీరోయిన్‌లుగా అవకాశాలు తగ్గి లేడీ ఓరియంటెడ్‌ పాత్రలతో సరిపెట్టుకొనే వాళ్ళు కొంతమంది కాగా స్పెషల్‌ క్యారెక్టర్‌లుగా చేయడంతో కెరీర్‌ బావుందని వాటితో సరిపెట్టుకొనే వాళ్ళు ఇంకొందరు..  అయితే పెళ్ళి వయసు వచ్చినప్పటికీ అవకాశాలు వస్తున్నాయి కదా అని పెళ్ళిని వాయిదా వేసుకుంటూ తమ కెరీర్‌ను సాగిస్తున్న వారిలో అనుష్క, నయనతార, తమన్నా, శ్రీయ, శ్రుతిహాసన్‌, త్రిషలు ముఖ్యులుగా చెప్పుకోవచ్చు. వీళ్ళందరూ ఒకప్పుడు మంచి వయసులో ఉన్నప్పుడు స్టార్స్‌గా అగ్ర హీరోల సరసన ఓ వెలుగు వెలిగి వారికి సమానంగా రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే పర్‌ఫార్మెన్స్‌ పరంగా స్టార్‌ హీరోలకు ఏ మాత్రం తగ్గకుండా చేసేవారు. కాకపోతే ఇప్పుడు అగ్ర హీరోల సరసన వచ్చిన అవకాశాలను వదులుకోకుండా సినిమాలు చేస్తూనే అప్పుడప్పుడు లేడి ఓరియంటెడ్‌ పాత్రల్లో మెరుస్తూ తమ అభిరుచులను తీర్చుకుంటున్నారు. ఇప్పుడొస్తున్న కుర్రహీరోల వయసుకు వీరి వయసుకు మధ్య తేడా కూడా ఉండడంతో హీరోయిన్‌లుగా పాత్రలు రాకపోవడం ఒక కారణం కాగా.. నిన్నటి తరం హీరోలుగా ఉన్న సీనియర్‌ హీరోలకు ఇప్పుడొచ్చే నూతన కథానాయకలకు వయసు తేడా ఉండడంతో ఏజ్‌ తేడాతో పాటు నటనానుభవం కూడా కొంత తేడా ఉండడంతో  ఈ హీరోయిన్‌లనే ఫిక్స్‌ చేస్తుండడంతో కూడా ఒక రకంగా హీరోయిన్‌లుగా బిజీగా ఉండడానికి కారణంగా చెప్పుకోవచ్చు. ఇక వీరి వయసు గురించి ఒకసారి మాట్లాడుకుంటే దాదాపు థర్టీ ప్లస్‌లో ఉన్నారు. పెళ్ళి వయసు వచ్చినప్పటికీ అవకాశాలు వస్తున్నాయి కదాని పెళ్ళి మీద ఆసక్తి కనబరచడంలేదనేది వాస్తవం. అలా చూసుకుంటే.. ఇటీవల బాహుబలితో సంచలనం విజయం సాధించి దేవసేనగా మంచి క్రేజ తెచ్చుకుంది అనుష్క. ప్రభాస్‌ కాంబినేషన్‌లో వీరి నుండి బిల్లా, మిర్చి వంటి హిట్‌ సినిమాలు వచ్చాయి. అదీగాక వీళ్ళిద్దరి కెమెస్ట్రీ కూడా ఆన్‌ స్క్రీన్‌ మీద చూడడానికి చాలా బావుంటుందని  ఇండస్ట్రీ టాక్‌. అలాగే బాహుబలి తరువాత ప్రభాస్‌- అనుష్కలు ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా ఇండస్ట్రీలో హల్‌చల్‌ చేశాయి. కానీ ఆ తరువాత అవి వట్టి రూమర్స్‌ అని తేలాయి. అయితే అనుష్క ఇంట్లో ఈ స్వీటీకి పెళ్ళి చేయాలని దానికోసం సంబంధాలు కూడా చూస్తున్నారని తెలుస్తుంది. అయితే తగిన మ్యాచ్‌ ఏది సెట్‌ కాకపోవడంతో అనుష్క పెళ్ళి కోసంపూజలు, వ్రతాలు కూడా చేస్తున్నారని టాక్‌. పెళ్ళి మాటలు జరుగుతున్నప్పటికీ అనుష్క సినిమాలు చేయడంలో ఆసక్తిగానే ఉంది. హ్యాపిడేస్‌, 100% లవ్‌, బద్రినాథ్‌, ఊసరవెల్లి, రెబల్‌, అభినేత్రి, బాహుబలి తదితర చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది తమన్న. బాహుబలిలో అవంతికగా తను పోషించిన పాత్రకు చాలా మంచి అప్లాజ్‌ వచ్చింది ఈ మిల్కీబ్యూటీకి. హీరోయిన్‌గా అవకాశాలు కొంత తగ్గడంతో స్పెషల్‌ క్యారెక్టర్స్‌పై ఇంట్రస్ట్‌ చూపిస్తోంది తమన్న. కాకపోతే ప్రస్తుతం కెరీర్‌ స్లోగా ఉన్న ఈ మిల్కీబ్యూటీ త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని ఫిలింనగర్‌ సమాచారం. తర్వాత.. నీ మనసు నాకు తెలుసు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై వర్షంతో ప్రేక్షకుల్లో మంచి స్థానం సంసాదించుకుంది త్రిష. ఇప్పటివరకు ఎన్నో సక్సెస్‌ఫుల్‌ సినిమాలు చేసిన త్రిష స్టార్‌ హీరోలందరి సరసన నటించింది. హీరోయిన్‌గా కొంత హవా తగ్గడంతో లీడ్‌ రోల్స్‌ చేయడంలో మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం స్పెషల్‌ క్యారెక్టర్స్‌కు ఇంట్రస్ట్‌ చూపిస్తుంది త్రిష. కెరీర్‌లో హీరోయిన్‌గా టాప్‌ స్టేజ్‌కి వెళ్ళిన త్రిష గతంలో రానాతో ప్రేమాయణం సాగించినట్టుగా కొన్ని వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేసిన విషయం తెలిసిందే. కాగా  ప్రస్తుతం చేతిలో పెద్దగా సినిమాలు లేని త్రిష ఆలోచనలు పెళ్ళి మీదకు మళ్ళాయని త్వరలో పెళ్లి చేసుకోబోతోందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇటీవల మంచి సక్సెస్‌ఫుల్‌ చిత్రాలతో ముందుకు దూసుకుపోతోంది శ్రుతి హాసన్‌. సంఘమిత్ర చిత్రంతో వార్తల్లో కెక్కింది శ్రుతి. ఈ సినిమా కోసం కథకనుగుణంగా యుద్ద పోరాటాల కోసం కత్తి విన్యాసాలు నేర్చుకున్న విషయం కూడా తెలిసిందే. ఇంతలో ఏమైందో కానీ సంఘమిత్ర సినిమా శ్రుతి చేయడంలేదనే వార్త హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సినిమా చేయకపోవడానికి కారణం తగిన స్కిప్టు కరక్ట్‌గా లేదని, యూనిట్‌ పక్కా ప్లానింగ్‌లో లేదని శ్రుతిహాసన్‌ చెప్పడం విశేషం. అయితే అసలు విషయం మాత్రం శ్రుతిహాసన్‌ ప్రేమలో పడిందని త్వరలో పెళ్ళి చేసుకునే ఆలోచనలో శ్రుతి ఉన్నట్టు సంఘమిత్ర సినిమా కమిట్‌ అయితే రెండు మూడు ఏళ్ళు సినిమా కోసం లాక్‌ అవాల్సి వస్తుందని, అప్పటి దాకా ఆగే ఓపిక తనకు లేకపోవడంతో ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇదే క్రమంలో దాదాపు అగ్ర కథానాయకులతో నటించిన శ్రీయ తాజాగా బాలకృష్ణతో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కొత్త తరం నాయికల ప్రవేశంతో హీరోయిన్‌గా శ్రీయకు అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. సీనియర్‌ ీహరోలతో తప్ప కుర్ర హీరోలతో అవకాశాలు లేక సీనియర్‌ హీరోలతో వచ్చిన సినిమాలు చేస్తూ మద్యమధ్యలో స్పెషల్‌ సాంగ్స్‌ చేస్తూ కెరీర్‌ వెళ్ళదీస్తుంది శ్రీయ. కాగా ప్రస్తుతం స్తో కెరీర్‌తో ముందుకు వెళ్తున్న శ్రీయ త్వరలో వివాహం చేసుకోబోతోందని తెలుస్తుంది. ఈ వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతుంది. లక్ష్మి, తులసి, దుబాయ్‌శీను, అదుర్స్‌, సింహా, శ్రీరామరాజ్యం, బాబు బంగారం వంటి సూపర్‌ హిట్‌ చిత్రాలతో వరుస సక్సెస్‌లను అందుకుంటూ తనకంటూ ఒక బ్రాండ్‌ మార్క్‌ను క్రియట్‌ చేసుకుని కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చేసే రేంజ్‌కు వెళ్ళింది నయనతార. అయితే ప్రస్తుతం నూతన హీరోల రాకతో హీరోయిన్‌గా అవకాశాలు తగ్గడంతో కొత్త తరహా పాత్రలపై మొగ్గు చూపుతోంది నయన్‌. ఆ తరహాలో వచ్చిందే డొర. ఇటీవల డొర సినిమాలో లేడీ ఓరియంటెడ్‌గా లీడ్‌రోల్‌ను ప్లే చేసింది నయనతార. ఇదంతా రీల్‌ లైఫ్‌లో ఒక నయన్‌ది ఒక భాగమైతే రియల్‌ లైఫ్‌లో త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని వార్త సోషల్‌ మీడియాలో హల్‌ చల్‌ చేస్తోంది. గతంలో శింబుతో ప్రేమాయణం కొనసాగించి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది నయనతార. ఇద్దరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నారని అందరూ అనుకున్నారు. అంతలో ఏమైందో కానీ ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తడంతో ఇద్దరూ ఎవరికి వారు సైలెంట్‌ అయి కెరీర్‌పై శ్రద్ద చూపించారు. ఆ తర్వాత మళ్ళీ నయనతార ప్రభుదేవాతో కొన్నాళ్ళు ప్రేమలో పడి మళ్ళీ వార్తల్లో కెక్కి సంచలనం సృష్టించింది. వీళ్ళిద్దరు కూడా సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారి పెళ్ళి పెళ్ళి దాకా వెళ్ళి ఆగిపోయారు. ఇవన్నీ సినిమా పరిశ్రమలో కామనే. మరి ఇండస్ట్రీలో పెళ్ళి పరంగా ఇంత క్రేజ్‌ తెచ్చుకున్న నయనతార త్వరలో పెళ్ళి చేసుకోబోతోందని తెలుస్తుంది.