హరితహారం కార్యక్రమంలో ప్రతీ ఒక్కరూ పాల్గొని మొక్కలు నాటాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. మొక్కలను పెంచి పెద్ద చేయడం అందరి బాధ్యత అన్నారు. మానవ మనుగడకు చెట్లే ఆధారం అని చెప్పిన గవర్నర్.. హరితహారంలో అందరూ ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. రాజ్‌భవన్ మోడల్ స్కూల్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో గవర్నర్ నరసింహన్, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి పాల్గొని మొక్కలు నాటారు. రాజ్‌భవన్‌లో మొక్కలు నాటేందుకు గవర్నర్ చొరవ తీసుకోవడం ఆనందంగా ఉందని కేంద్రమంత్రి దత్తాత్రేయ అన్నారు. నాటిన మొక్కల్ని పెంచే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలని ఆయన సూచించారు. అటు విద్యాసంస్థల్లో ఇవాళ గ్రీన్‌డే నిర్వహిస్తున్నట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ప్రతీ పాఠశాలలో ఒక్కో మొక్కను కాపాడే బాధ్యత విద్యార్థులకు అప్పజెప్తున్నట్లు చెప్పారు. రాజ్‌భవన్ పాఠశాలలో గవర్నర్ వచ్చి మొక్కలు నాటడం ఆనందంగా ఉందన్నారు. హరితహారంలో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని శ్రీహరి పిలుపునిచ్చారు.