రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు వేర్వేరు బ్యాలెట్ పత్రాలు

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 11:42 AM
 

ఈసారి రాష్ట్రపతి ఎన్నికల్లో కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. గతంలోలా కాకుండా ఈసారి ఎన్నికల ఓటింగ్ కోసం సరికొత్త పెన్నులు, వేర్వేరు బ్యాలెట్లను ఉపయోగించబోతున్నారు. ఎంపీలకు ఆకుపచ్చ, ఎమ్మెల్యేలకు గులాబీ రంగులో ఉండే బ్యాలెట్ పేపర్లను అందుబాటులో ఉంచారు. గతేడాది రాజ్యసభ ఎన్నికల సందర్భంగా హరియాణాలో సిరా (ఇంకు) విషయంలో వివాదం తలెత్తింది. ఈ కారణంగా ఈసారి ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక పెన్నులను సిద్ధం చేశారు. ఈ పెన్నుల్లోని సిరా ఊదా రంగులో ఉంటుంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లే సమయంలో వారి వద్ద ఉన్న పెన్నులు తీసుకుని ఈ కొత్త పెన్నులను వారికి అందిస్తారు. ఓటు వేశాక మళ్లీ వాటిని తీసుకుంటారు. ఓటింగ్ గది లోపల ఓటర్లు ఎలా వ్యవహరించాలన్న సూచనలను పోలింగ్ కేంద్రాల్లో ఈసీ ప్రదర్శించనుంది. ఇలా చేయడం దేశంలో ఇదే తొలిసారి!