బిగ్‌బాస్ పార్టిసిపెంట్ల‌పై విమ‌ర్శ‌ల వ‌ర్షం

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 04:43 PM
 

జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా బిగ్‌బాస్ కార్యక్ర‌మం అంగ‌రంగ‌వైభవంగా ప్రారంభ‌మైంది. ఇన్ని రోజులు ఊరించిన పార్టిసిపెంట్ల పేర్లు తెలిసిపోయాయి. `ఈ షో కోసం వంద మందిని క‌లిసి, 14 మందిని ఎంపిక చేశాం!` అని చెప్పుకున్న నిర్వాహ‌కుల‌ మాట‌లు విని వీక్ష‌కులు ఏదేదో ఊహించుకున్నారు. తీరా అస‌లు పార్టిసిపెంట్ల గురించి తెలిసి `వీరి కోస‌మా వంద మందిని వెతికింది!` అని పెద‌వి విరుస్తున్నారు. అంతేకాకుండా సోష‌ల్ మీడియా వేదిక‌గా విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఒక్క మ‌హేశ్ క‌త్తి మిన‌హా మిగ‌తా వారంద‌రూ ఏదో ఒక తెర మీద క‌నిపించిన‌వారే కావ‌డంతో పార్టిసిపెంట్ల ఎంపిక‌లో భిన్న‌త్వం క‌నిపించ‌డం లేద‌ని వీక్ష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అలాగే ముమైత్ ఖాన్ విష‌యంలో బిగ్‌హౌస్‌లో తెలుగు మాత్ర‌మే మాట్లాడాల‌నే నిబంధ‌న ఎలా స‌రిపోతుందని వారు ప్ర‌శ్నిస్తున్నారు. ఇత‌ర భాష‌ల్లో వివాదాల‌కు కేంద్ర బిందువుగా కొన‌సాగిన బిగ్‌బాస్ వంటి కార్య‌క్ర‌మంలో సౌమ్యంగా క‌నిపించే ధ‌న్‌రాజ్‌, హ‌రితేజ‌, శివ బాలాజీ, సంపూర్ణేశ్ బాబులు ఎన్ని రోజులు మ‌నగలుగుతార‌ని అడుగుతున్నారు. ఇదిలా ఉండ‌గా వ్యాఖ్యాత‌గా ఎన్టీఆర్‌కు మాత్రం మంచి మార్కులు ప‌డ్డాయి. హాస్యాన్ని, మేన‌రిజాన్ని త‌న‌దైన శైలిలో అన్వ‌యిస్తూ షోని బాగా న‌డిపాడ‌ని నెటిజ‌న్లు పొగుడుతున్నారు. ఆదివారం రాత్రి ప్ర‌సార‌మైన బిగ్‌బాస్ కార్య‌క్ర‌మానికి రికార్డు స్థాయిలో టీఆర్‌పీ రేటింగ్‌లు వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.