రవితేజకు డ్రగ్స్‌ అలవాటు లేదు: రాజేంద్ర

  Written by : Suryaa Desk Updated: Mon, Jul 17, 2017, 04:59 PM
 

హైదరాబాద్‌: హీరో రవితేజకు డ్రగ్స్‌ అలవాటు లేదని ఆయన కుటుంబ వైద్యుడు, సన్నిహితుడు కడియాల రాజేంద్ర తెలిపారు. రవితేజ పేరును డ్రగ్స్‌ కేసులోకి లాగడం బాధించిందని, ఆయన కుటుంబ సభ్యులు కూడా ఎంతో వేదనకు గురయ్యారని చెప్పారు. సోమవారం ఆయన ‘సాక్షి’టీవీతో మాట్లాడుతూ... రవితేజకు సిగరెట్‌ వాసన కూడా గిట్టదని వెల్లడించారు. అవుట్‌డోర్‌ షూటింగ్‌లో ఉండడం వల్లే ఆయన మీడియాకు ముందుకు రాలేదన్నారు. రవితేజపై జరుగుతున్న ప్రచారం అబద్దమని చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందికాబట్టి తాను మీడియా ముందుకు వచ్చినట్టు వివరించారు. డ్రగ్స్‌ వ్యవహారంతో రవితేజకు సంబంధం లేదన్న విషయం దర్యాప్తులో తేలుతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. రవితేజ తమ్ముడు భరత్‌ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన రోజున మద్యం మత్తులో లేడని, ఆ రోజు ఆయన తాగలేదని డాక్టర్‌ రాజేంద్ర వెల్లడించారు. డ్రగ్స్‌ కేసులో దొరికిన తర్వాత ఆయన మారిపోయాడని, దురలవాట్లు మానుకున్నారని చెప్పారు. బిగ్‌బాస్‌కు సెలెక్టయ్యానని ఇటీవల తనతో చెప్పారని గుర్తు చేసుకున్నారు. అన్నిమానేసిన తర్వాత భరత్‌ చనిపోవడం బాధాకరమని ఆయన అన్నారు. భరత్ అంత్యక్రియల విషయంలోనూ రవితేజ కుటుంబాన్ని మీడియా తప్పుగా చిత్రీకరించిందని వాపోయారు. రవితేజ కుటుంబంపై అసత్య ప్రచారం చేయొద్దని మీడియాను కోరారు.